రండి.. పార్లమెంట్ సమావేశాలపై చర్చించుకుందాం : అన్ని పార్టీలకు కేంద్రం పిలుపు

రండి.. పార్లమెంట్ సమావేశాలపై చర్చించుకుందాం : అన్ని పార్టీలకు కేంద్రం పిలుపు

సెప్టెంబర్  18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండా మాత్రం ఇప్పటి వరకు కేంద్ర వెల్లడించలేదు. ఈ క్రమంలో  సెప్టెంబర్ 17వ తేదీన అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది.  సెప్టెంబర్ 17న జరిగే అల్ పార్టీ మీటిగ్ కు  అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించింది.  

సెప్టెంబర్ 17వ తేదీన అఖిల పక్ష సమావేశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి  అధికారిక ప్రకటన చేశారు.  అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం... ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఆ పార్టీల నేతలకు ఈ మెయిల్ ద్వారా ఆహ్వానం  పంపించాం.. అనిప్రహ్లాద్ జోషి  ట్విటర్ లో  వెల్లడించారు. 

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరుగుతాయని కేంద్రం ఇది వరకే ప్రకటించింది.  ఎజెండాలో ఏయే అంశాలు ఉన్నాయని మాత్రం చెప్పలేదు. కానీ  అందులో ముఖ్యమైన  అంశాలున్నాయని.. వాటిని సిద్ధం చేస్తున్నామని  పేర్కొంది. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం ఆనవాయితీ అని....కానీ తమతో  ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారని  సోనియా గాంధీ విమర్శించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టతనివ్వాలని అందులో కోరారు.


ఐదు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను వెల్లడించలేనప్పటికీ..మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలతోపాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే పార్లమెంటు పాత భవనం నుంచి కొత్త భవనానికి కార్యకలాపాలు మార్చవచ్చని తెలుస్తోంది.