V6 News

మహిళలను మోసం చేసింది.. మమత సర్కారుపై ప్రధాని మోదీ ఫైర్

మహిళలను మోసం చేసింది.. మమత సర్కారుపై ప్రధాని మోదీ ఫైర్

కోల్‌‌కతా: బెంగాల్‌‌ ప్రజలను ముఖ్యంగా మహిళలను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌‌ సర్కారు దారుణంగా మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. టీఎంసీ ఉన్నంతకాలం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదని తెలిపారు. ఆదివారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. 

టీంఎసీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ ప్రసిద్ధ నినాదమైన ‘మా, మాటి, మానుష్ (అమ్మ, మట్టి, మనుషులు)’ను ప్రస్తావిస్తూ  ఎద్దేవా చేశారు.  ‘‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల వల్ల అమ్మ (మా) కన్నీరు పెడుతున్నది. బెంగాల్ మట్టి (మాటి) చొరబాటుదారుల పరమైపోయింది. సామాన్య ప్రజలు (మానుష్‌‌) భయం గుప్పిట్లో బతుకుతున్నారు” అని వ్యాఖ్యానించారు. 

  • 15 ఏండ్లుగా మహిళలపై దాడులు

 రాష్ట్రంలో గత 15 ఏండ్ల టీఎంసీ పాలనలో  మహిళలపై దాడులు జరిగాయంటూ ఒక్కో ఘటనను ఏకరువుపెట్టారు. కోల్‌‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో యువ డాక్టర్‌‌పై జరిగిన అత్యాచారం, హత్య రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కామ్దుని సామూహిక అత్యాచారం, పార్క్ స్ట్రీట్, హన్స్‌‌ఖాలీలాంటి పలు ఘటనలను ప్రస్తావిస్తూ బెంగాల్‌‌ను టీఎంసీ అధోగతికి తీసుకెళ్లిందని విమర్శించారు. రాష్ట్రంలో తరచుగా బాలికలు అదృశ్యమవుతున్న కేసులు నమోదు అవుతున్నాయని మోదీ పేర్కొన్నారు. 

అయినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిద్రపోతోందని మండిపడ్డారు.  నేరస్తులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బాధితులనే తప్పుబట్టే ధోరణి కనిపిస్తోందని మోదీ ఆరోపించారు. మహిళలతో పాటు రైతులు, కార్మికుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తున్నదని చెప్పారు.  11 ఏండ్లలో జనపనార కనీస మద్దతు ధరలను రెట్టింపు చేశామని, 
గోధుమలు, బియ్యం కోసం 100 శాతం జనపనార ప్యాకేజింగ్‌‌ను తప్పనిసరి చేశామని వెల్లడించారు.

  • ‘గుండా రాజ్’ అంతమే లక్ష్యం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కోల్‌‌కతా: బెంగాల్‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సాగుతున్న ‘గుండా రాజ్’కు ముగింపు పలుకుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆయన నాడియా జిల్లాలోని తెహట్టాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశ పోలింగ్​లోనే మమత ప్రభుత్వాన్ని ఓటర్లు తుడిచిపెట్టేశారని షా పేర్కొన్నారు. బీజేపీ దాదాపు110 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని చొరబాటుదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.