
- ప్రధానమంత్రిని నమ్మొద్దన్న ప్రియాంక గాంధీ
‘ప్రధాని మోడీని నమ్మొద్దు.. స్కూల్‌లో పరీక్ష ఫెయిల్ అయిన పిల్లాడిలా ఆయన అబద్ధాలు చెబుతున్నారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. జార్ఖండ్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆమె.. దేశ వ్యాప్తంగా విద్యార్థులు చెబుతున్న మాటలు విని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారని అన్నారు. అస్సాంలో స్థానికులు, గిరిజనుల హక్కులకు భంగం కలుగుతున్నాయని, దాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు రోడ్డెక్కారని చెప్పారామె.
ఓట్లు వేసే ముందు ఆ విద్యార్థుల గళం ఒక్కసారి వినాలని అన్నారు ప్రియాంక. మహిళలకు రక్షణ కల్పిస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని అంటూ మోడీ.. పరీక్ష ఫెయిల్ అయిన స్కూలు పిల్లాడిలా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ‘విద్యార్థుల మాటలు వినండి. రుణ మాఫీ చేసేవాళ్లకు, మహిళలకు రక్షణ కల్పించేవాళ్లకు, మీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేవాళ్లను గుర్తించి ఓట్లు వేయండి’ అని ప్రజల్ని కోరారామె.