బెంగళూరు: నెదర్లాండ్స్‌తో డేవిస్ కప్ క్వాలిఫయర్స్ పోరులో ఇండియా యంగ్ ప్లేయర్ దక్షిణేశ్వర్ సురేష్ అద్భుత పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో తొలి రోజు ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1–1తో సమంగా నిలిచాయి. శనివారం జరిగిన రెండో సింగిల్స్‌లో సురేశ్ 6–-4, 7–-5 తేడాతో ప్రపంచ 88వ ర్యాంకర్ జెస్పర్ డి జోంగ్‌ను ఓడించి ఔరా అనిపించాడు. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా నంబర్ వన్ ఆటగాడు సుమిత్ నాగల్ 0–-6, 6–-4, 3–-6తో గై డి ఔడెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
నాగల్ పరాజయంతో 0-–1తో వెనుకబడిన ఇండియాను దక్షిణేశ్వర్ తన పోరాట పటిమతో 1–-1తో సమం చేసి రేసులో నిలబెట్టాడు. ప్రస్తుతం ఇరు జట్లు సమాన స్థితిలో ఉండటంతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లు నిర్ణయాత్మకం కానున్నాయి. డబుల్స్ లో యూకీ బాంబ్రీ– శ్రీరామ్ బాలాజీ జోడీ నెదర్లాండ్స్ ద్వయం సాండర్ అరెండ్స్– డేవిడ్ పెల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అనంతరం రివర్స్ సింగిల్స్ జరగనున్నాయి. ఈ టైలో విజేతగా నిలిచిన జట్టు సెప్టెంబర్‌లో జరిగే క్వాలిఫయర్ రౌండ్– 2కు అర్హత సాధిస్తుంది.
