V6 News

10న పరేడ్గ్రౌండ్లో ప్రధాని మోదీ సభ.. రూ.7,823 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం : కిషన్రెడ్డి

10న పరేడ్గ్రౌండ్లో ప్రధాని మోదీ సభ.. రూ.7,823 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం : కిషన్రెడ్డి
  • దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణకు రానున్నట్టు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ.. తొలిసారి భాగ్యనగరానికి వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో తెలంగాణలో రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టేందుకే 10న పరేడ్ గ్రౌండ్​లో జన ఆగ్రహ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి  మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బలం గణనీయంగా పెరిగిందని, సుమారు 40 లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. రైల్వే రంగంలో రూ.85 వేల  కోట్ల పనులు సాగుతున్నాయని, కాజీపేట–విజయవాడ మూడో రైల్వే లైన్, బైపాస్ లైన్లను ప్రధాని జాతికి అంకితం చేస్తారన్నారు.  మల్కాపూర్ వద్ద రూ.611 కోట్లతో నిర్మించిన భారీ పెట్రోలియం టర్మినల్‌‌‌‌‌‌‌‌ను కూడా పీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. జోగులాంబ, హైటెక్ సిటీ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కూడా తుది దశకు చేరిందని వివరించారు.

  • వరంగల్‌‌‌‌‌‌‌‌లో టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ హబ్

కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్లగ్ అండ్ ప్లే మోడల్‌‌‌‌‌‌‌‌లో నిర్మితమవుతున్న ఈ జోన్ ద్వారా సుమారు 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లో కాకతీయ పీఎం మిత్ర మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీనికోసం ఇప్పటికే కొరియాకు చెందిన ‘యంగ్ వన్’ వంటి అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, ఫామ్ టు ఫ్యాషన్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రైతుల నుంచి ఎగుమతుల వరకు చైన్ సిస్టమ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. 

ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క–సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించామని, భూమి అప్పగింత పూర్తి కావడంతో త్వరలోనే శాశ్వత భవనాల నిర్మాణం చేపడతామని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ తార్నాకలో రూ.400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న నేషనల్ సైన్స్ సెంటర్ విద్యార్థులకు, ఐటీ, డిఫెన్స్ రంగాల పరిశోధనలకు కీలకంగా మారుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ పనులు స్పీడందుకున్నాయని, భూసేకరణ పూర్తి కాగానే ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామన్నారు.
 
అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పని.. 

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ పనిగా మారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పారు. సీట్ల పెంపు జరిగి ఉంటే తెలంగాణలో లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగేవని, తద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం దక్కేదన్నారు. కానీ, కుటుంబ రాజకీయాలను కాపాడుకోవడానికే కాంగ్రెస్ ఈ మార్పులను అడ్డుకుందని ఆయన విమర్శించారు.