త్రివిధ దళాల అధిపతులతో మోదీ భేటీ

త్రివిధ దళాల అధిపతులతో మోదీ భేటీ
  • రక్షణ మంత్రి రాజ్ నాథ్, ఎన్ఎస్ఏ దోవల్ హాజరు
  • ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ లతోనూ సమావేశం 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హైలెవల్ డిఫెన్స్ మీటింగ్ నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్​డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి పాల్గొన్నారు. 

బార్డర్ లో నెలకొన్న తాజా పరిస్థితి, పాక్ విషయంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఆర్మీ, నేవీ, వాయుసేన టాప్ రిటైర్డ్ ఆఫీసర్లతోనూ మోదీ భేటీ అయ్యారు. సైన్యంలో వారికి ఉన్న అపార అనుభవం ఆధారంగా తాజా పరిస్థితిని ఎదుర్కోవడంపై వారి సూచనలు, సలహాలను ప్రధాని తీసుకున్నారు. 

కాగా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయనతోపాటు సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులు చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాక్ డ్రోన్ అటాక్స్ ను ఇండియన్ ఆర్మీ దీటుగా అడ్డుకున్న తర్వాత ఈ సమావేశం జరిగిందని, అందుకే రక్షణ మంత్రి, త్రివిధ దళాల అధిపతుల ముఖాల్లో ఆ సంతోషం కనిపిస్తోందని చెప్తున్నారు.