- స్కైరూట్ బృందాన్ని ప్రశంసిస్తూ..
- రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు
- పార్లమెంటులో ప్రతి గొంతుక వినిపించాలి
- దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి
- నిజం, తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని కామెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ను విజయవంతంగా ప్రయోగించడాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంస్థలో పనిచేసే యువ బృందం సగటు వయస్సు 28 ఏళ్లేనని చెప్పారు. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు. 28 ఏళ్ల సగటు వయస్సు ఉన్న యువ బృందం అంతరిక్షంలో భారత జెండా ఎగరవేసింది”అని కామెంట్లు చేశారు. ఇటీవల 56 ఏళ్లు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో మోదీ తన ‘‘56 అంగుళాల ఛాతీ’’ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ తర్వాత పలుమార్లు రాహుల్ గాంధీ కూడా అదే పదాన్ని ఉపయోగిస్తూ మోదీపై విమర్శలు చేశారు. చైనా సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో ‘‘చైనా ఎదుట మీ 56 అంగుళాల ఛాతీ కనిపించలేదేం” అని ప్రశ్నించారు.
పార్లమెంటులో ప్రతి గొంతుక వినిపించాలి
సోమవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ, పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చలు జరగాలని కోరారు. ‘ప్రతి గొంతుకకు పార్లమెంట్‌లో వినిపించే అవకాశం ఉండాలి. నిజాలు, తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. బలమైన ఆధారాలతో మాట్లాడితే అదే ప్రజలను ఒప్పిస్తుంది”అని అన్నారు. దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలని చెప్పారు. స్కైరూట్ విజయం భారత యువత సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన మూడో దేశంగా భారత్ నిలవడం గర్వకారణమని అన్నారు.
రాహుల్ నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతున్నరు
మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. “ప్రధాని మోదీ కాంమెంట్లు ఇది సిగ్గుచేటు. రాహుల్ గాంధీ తన తాను గురించి మాట్లాడడం లేదు. 20, 22, 25, 26 ఏళ్ల నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుటుంబాలు తమ పిల్లలను భూములు అమ్మి చదివించినా పేపర్ లీక్‌లతో వారి భవిష్యత్ దెబ్బతింటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు. వారి సమస్యలనే రాహుల్ ప్రస్తావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని పరోక్షంగా విమర్శించడం సరికాదు”అని ఆమె అన్నారు.
