గణపతి బప్పా మోరియా.. ప్రముఖుల శుభాకాంక్షలు

గణపతి బప్పా మోరియా.. ప్రముఖుల శుభాకాంక్షలు

నేడు గణేశ్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. విఘ్నాలను తొలగించే గణేశుడు.. జ్ఞానం, పరిపూర్ణత, అదృష్టానికి ప్రతీక అన్నారు. ఈ వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, శాంతి శ్రేయస్సులతో జీవించాలని కోరుకుంటున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. ఆటంకాలను పోగొట్టి, కార్యాలను సిద్ధింపజేసే గణేశుడిన ఎల్లప్పుడూ స్తుతిద్దామన్న ప్రధాని మోడీ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ దేశ ప్రజలను విష్ చేశారు. 

గణపతి బప్పా మోరియా.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులకు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కుల, మత, ప్రాంతీయ బేధాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అన్న ఉప రాష్ట్రపతి ధన్ కర్.. ప్రతి ఒక్కరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. సకల విద్యలకు కొలువైన గణాధిపతి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ అవాంతరాలను తొలగించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశం వినాయక చవితి పండగలో ఉందన్న ఆయన... ఈ పండగ రోజు మట్టి లేదా పసుపుతో చేసిన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని వెంకయ్య పిలుపునిచ్చారు.