- జెన్ జీ సైంటిస్టులతో దేశంలో స్టార్టప్ రెవల్యూషన్: మోదీ
- హైదరాబాద్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్‌గా ప్రారంభం
- స్కైరూట్ తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్–1’నూప్రారంభించిన ప్రధాని
హైదరాబాద్: అంతరిక్ష రంగంలో యువత పాత్ర అత్యంత కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జెన్ జీ(జనరేషన్ జడ్) ఇంజనీర్లు, జెన్ జీ డిజైనర్లు, జెన్ జీ కోడర్లు, జెన్ జీ సైంటిస్టులు కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారని ప్రశంసించారు. జెన్ జీ యువత (1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) కృషితోనే దేశంలో స్టార్టప్ రెవెల్యూషన్ ప్రారంభమైందన్నారు. గురువారం హైదరాబాద్ లోని స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను, ఆ సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్–1’ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పేస్ సెక్టార్లో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన సంస్కరణలు తెచ్చిందని, వాటి ఫలితంగా ఈ రంగంలో స్కైరూట్ వంటి అనేక ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు.
దేశంలో ప్రస్తుతం 300కుపైగా స్పేస్ స్టార్టప్ లు ఉన్నాయన్నారు. వీటిలో చాలా స్టార్టప్‌లు అతికొద్ది మందితో, కిరాయి గదులలో మొదలయ్యాయని, నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్ లు, యూనికార్న్‌లతో ఇండియా ప్రపంచంలోనే స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మూడో స్థానంలో ఉందన్నారు. ఇండియా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు, యువశక్తికి ఇన్ఫినిటీ క్యాంపస్ ఒక ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. క్రియేటివిటీ, సానుకూల దృక్ఫథం, సామర్థ్యాన్ని అలవర్చుకుని ముందుకు వెళ్తున్న మన యువతరం ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో ఎప్పుడు కొత్త అవకాశాలు వచ్చినా.. యువతరం వాటిని అందిపుచ్చుకుంటుందని అన్నారు. నేటి యువత అన్ని అంశాల కంటే దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్నారు. అంతరిక్ష రంగంతోపాటు ప్రధానంగా ఫిన్ టెక్, అగ్రిటెక్, హెల్త్ టెక్, క్లైమేట్ టెక్, ఎడ్యూటెక్, డిఫెన్స్ టెక్ వంటి రంగాల్లో జెనరేషన్ జడ్ యువత కొత్త కొత్త పరిష్కారాలను కనుగొంటోందని మెచ్చుకున్నారు. విద్యార్థుల్లో రీసెర్చ్, ఇన్నోవేషన్ పట్ల ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని.. రాబోయే రోజుల్లో మరో 50 వేల ల్యాబ్ లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.
దేశంలో రాకెట్ ప్రయోగించిన తొలి ప్రైవేట్ కంపెనీ..
- స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విక్రమ్ –1 రాకెట్‌కు శాటిలైట్లను కక్ష్యలోకి పంపే సామర్థ్యం ఉంది. దాదాపుగా ప్రతి నెలకు ఓ రాకెట్ చొప్పున తయారు చేసే లక్ష్యంతో మొత్తం
- 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీని విస్తరించారు. రాకెట్ డిజైనింగ్, డెవలపింగ్, ఇంటిగ్రేటింగ్, టెస్టింగ్ వంటివన్నీ ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ఇస్రో మాజీ సైంటిస్టులు, ఐఐటీ పూర్వ విద్యార్థులైన పవన్ కుమార్ చందాన, నాగ భరత్ దకా కలిసి ఈ కంపెనీని 2018లో స్థాపించారు. విక్రమ్ ఎస్ పేరుతో 2022లోనే సబ్ ఆర్బిటల్ రాకెట్‌ను ప్రయోగించిన ఈ కంపెనీ.. దేశంలో రాకెట్ ప్రయోగం చేపట్టిన తొలి ప్రైవేట్ కంపెనీగా రికార్డ్ సృష్టించింది.
