అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు: ప్రధాని మోడీ

అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు: ప్రధాని మోడీ

 దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ తప్ప.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను చిత్తు చేస్తూ బీజేపి విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ప్రసంగించారు. 

తెలంగాణలో  అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని  మోడీ అన్నారు. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని అన్నారు. తెలంగాణలో మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారని..  ప్రతి ఎన్నికల్లో రాష్ట్రంలో బలపడుతూ వస్తున్నామని అన్నారు.. తెలంగాణతో మాకు మంచి అనుబంధం ఉందని.. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పడూ పనిచేస్తుందని ప్రధాని చెప్పారు.

ఏ ప్రభుత్వం కావాలనే విషయంలో దేశ ప్రజలు పరిపక్వతతో ఉన్నారని..  అన్ని రకాలుగా ఆలోచించే  ప్రజలు ఓటేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వాల కార్యక్రమాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం..2024 పార్లమెంట్ ఎన్నికల విజయానికి బాటలు వేసిందన్నారు. వచ్చే  లోక్ సభ ఎన్నికల్లో కూడా మాకు  గ్యారంటీ ఉందని అన్నారు. 

తాను కాంగ్రెస్ పార్టీకి ఒక సలహా ఇస్తున్నానని. . దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయవద్దని చెప్పారు. జీఎస్టీ వసూళ్లు రికార్డు సృష్టిస్తున్నాయని.. అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని... ఈ అభివృద్ధి కొనసాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు.