ఉదయనిధి కామెంట్లపై.. దీటుగా జవాబు చెప్పండి : మోదీ

ఉదయనిధి కామెంట్లపై..  దీటుగా జవాబు చెప్పండి :  మోదీ
  • ఉదయనిధి ‘సనాతన’ కామెంట్లపై.. 
  • కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన 
  • చరిత్ర లోతుల్లోకి వెళ్లొద్దు.. రాజ్యాంగబద్ధంగా వాస్తవాలు చెప్పాలె 
  • ఇండియా, భారత్ అంశంపై జాగ్రత్తగా మాట్లాడాలని ఆదేశం 

న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లకు దీటుగా, సందర్భానికి తగ్గట్టుగా సరైన జవాబు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ‘‘మరీ చరిత్ర లోతుల్లోకి తొంగిచూడొద్దు. రాజ్యాంగబద్ధంగానే వాస్తవాలకు కట్టుబడి, ప్రస్తుత పరిస్థితుల గురించే మాట్లాడండి. సనాతన ధర్మంపై వివాదాస్పద కామెంట్లకు తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది” అని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.  

జీ20 సమిట్ సందర్భంగా బుధవారం కేంద్ర మంత్రులతో నిర్వహించిన మీటింగ్ లో మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. ‘ఇండియా’, ‘భారత్’ అంశంపై ఎవరూ.. ఎలాంటి కామెంట్లు చేయొద్దని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కూడా కేంద్ర మంత్రులకు ప్రధాని చెప్పినట్లు సమాచారం.

ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే మాట్లాడతారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేపై బుధవారం యూపీలోని రామ్ పూర్ లో కూడా కేసులు నమోదయ్యాయి.