దేవుడికే పాఠాలు చెప్తరు..  తనకే ఎక్కువ తెలుసని మోడీ నమ్మకం

దేవుడికే పాఠాలు చెప్తరు..  తనకే ఎక్కువ తెలుసని మోడీ నమ్మకం
  • దేవుడికే పాఠాలు చెప్తరు..  తనకే ఎక్కువ తెలుసని మోడీ నమ్మకం
  • అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్ 
  • ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో స్పీచ్

శాన్ ఫ్రాన్సిస్కో:  ప్రధాని నరేంద్ర మోడీ.. దేవుడికే పాఠాలు చెప్తారని, దేవుడి కంటే ఆయనకే ఎక్కువ తెలుసని అనుకుంటారని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ అన్నారు. ఆరు రోజుల అమెరికా పర్యటన కోసం మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో ‘మొహబ్బత్ కీ దుకాన్’ పేరుతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇండియాలో దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని అనుకునే వ్యక్తులలో ప్రధాని మోడీ ఒకరు. ఇలాంటి వాళ్లు.. చరిత్రకారులకు చరిత్రను, సైంటిస్టులకు సైన్స్ ను, ఆర్మీకి యుద్ధతంత్రాలను నేర్పిస్తారు. వీరికి ఈ ప్రపంచం చాలా పెద్దగా, కాంప్లికేటెడ్ గా అవుతుంది. అదొక రోగం. ఇండియాలో ఇలాంటి వ్యక్తులతో కూడిన ఒక గుంపు ఉంది. వాళ్లు దేవుడితో కూర్చుని, ప్రపంచంలో ఏం జరుగుతోందో ఆయనకే వివరించగలరు. ఒకవేళ మోడీజీని కూడా దేవుడితో కూర్చోబెడితే.. విశ్వం ఎలా పని చేస్తోందో ఆయన దేవుడికి వివరిస్తారు. చివరకు తాను ఏం సృష్టించానా? అని దేవుడే కన్ఫ్యూజ్ అయిపోతాడు” అని రాహుల్ కామెంట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఎవరి మాటలనూ వినేందుకు సిద్ధంగా ఉండరన్నారు. 

నేను కామన్ మ్యాన్ ను..

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రాహుల్ మంగళవారం రెండు గంటల పాటు లైన్ లో వెయిట్ చేశారు. ఎయిర్ పోర్టు వద్ద ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) చైర్ పర్సన్ శామ్ పిట్రోడా, ఇతరులు రాహుల్ కు స్వాగతం పలికారు. లైన్ లో వెయిట్ చేస్తుండగా, తోటి ప్యాసింజర్లు రాహుల్ తో సెల్ఫీలు దిగారు. లైన్ లో వెళ్తున్నారెందుకని పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. తాను కామన్ మ్యాన్ ను అని, అలా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు. ఇప్పుడు తాను ఎంపీని కూడా కానన్నారు. కాగా, రాహుల్ ఎంపీగా ఉన్నప్పుడు డిప్లమాటిక్ పాస్ పోర్టును పొందారు. కానీ గత మార్చిలో ఎంపీగా అనర్హతకు గురికావడం, కోర్టు కేసుల కారణంగా ఆయన డిప్లమాటిక్ పాస్ పోర్టును సరెండర్ చేశారు. తాజాగా ఆర్డినరీ పాస్ పోర్ట్ తీసుకుని అమెరికా పర్యటనకు వచ్చారు. 

ప్రతిపక్షాలన్నీ కలిస్తేనే.. బీజేపీని ఓడిస్తం

ప్రతిపక్ష పార్టీలన్నీ సరిగ్గా జత కలిస్తేనే బీజేపీని ఓడించగలమని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కాలిఫోర్నియా యూనివర్సిటీ సిలికాన్ వ్యాలీ క్యాంపస్ లో ఇండియన్ అమెరికన్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఒక పొలిటికల్ ఎంట్రప్రెన్యూర్​గా నేను బీజేపీలో లోపాలను స్పష్టంగా చూశాను. ప్రతిపక్షాలు తగినవిధంగా జతకలిస్తే బీజేపీని ఓడించొచ్చు” అని అన్నారు. భారత్ జోడో యాత్రలో వచ్చిన ఆలోచనలతోనే కర్నాటక ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేశామన్నారు. అయితే, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ 10 రెట్లు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందన్నారు. ఇండియాలో ఏం జరుగుతోందన్న దానిని మీడియా కరెక్ట్ గా చూపించడంలేదన్నారు. భారత్ జోడో యాత్రను ఆపేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డిందని, అయినా ఆపలేకపోయిందని రాహుల్ అన్నారు.  

ఖలిస్తానీ మద్దతుదారుల స్లోగన్స్

ఐఓసీ సమావేశంలో రాహుల్ మాట్లాడుతుండగా కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. కాంగ్రెస్ హయాంలో 1984లో జరిగిన సిక్కుల ఊచ కోతను, ఇందులో కాంగ్రెస్ పాత్రను వారు ప్రస్తావించారు. దీంతో ఆడియెన్స్ లో పలువురు రాహుల్ కు మద్దతుగా భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ స్పందిస్తూ.. ‘‘నఫ్రత్ కీ బజార్ మే మొహబ్బత్ కీ దుకాన్ (విద్వేష బజారులో ప్రేమ దుకాణం)కు స్వాగతం..” అని కామెంట్ చేశారు. తాము అందరి మాటనూ వింటామని, అందరినీ ప్రేమిస్తామన్నారు.    

విదేశాల్లో రాహుల్​ను జిన్నా ఆవహిస్తడు: బీజేపీ నేత నఖ్వీ ఎద్దేవా 

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లగానే ఆయనలోకి జిన్నా ఆత్మ.. లేదంటే అల్ కాయిదా నేతల మాదిరిగా ఆలోచించే వ్యక్తుల ఆత్మలు ప్రవేశిస్తాయని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్లపై నఖ్వీ బుధవారం మండిపడ్డారు. ‘‘రాహుల్ ఇండియాకు తిరిగి వచ్చి మంచి భూతవైద్యుడికి చూపించుకుంటే ఆత్మలను తరిమివేస్తాడని నేను సలహా ఇస్తున్నా” అని అన్నారు. ఇండియాను అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను చూయింగ్ గమ్ లా వాడుకుంటోందన్నారు. మోడీ పాపులారిటీని జీర్ణించుకోలేకనే ఇలా విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీకి ఏమీ తెలియకున్నా.. అన్నింట్లో ఎక్స్ పర్ట్ లా మాట్లాడుతుంటారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. ఆయనను ఒక ‘ఫేక్ గాంధీ’ అంటూ అభివర్ణించారు.