నవంబర్ 7న తెలంగాణకు మోదీ

నవంబర్  7న  తెలంగాణకు మోదీ
  •     ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభకు హాజరు
  •     11న సికింద్రాబాద్ లో మాదిగ సామాజిక వర్గాలసభలోనూ పాల్గొననున్న పీఎం 

 హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7న,11న హైదరాబాద్ టూర్ కు రానున్నారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించారు. 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న “బీసీల ఆత్మగౌరవ సభ”లో మోదీ పాల్గొంటారని, ఆ తర్వాత 11వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాదిగ సామాజిక వర్గాల సభకూ హాజరవుతారని వెల్లడించారు. ఖరారు అయిన షెడ్యూల్ ప్రకారం.. మోదీ ఈ నెల 7 న మధ్యాహ్నం 3 గంటలకు యూపీ ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5. 30 నుంచి 6. 10 గంటల వరకు 40 నిమిషాల పాటు ఎల్బీ స్టేడియం సభలో పాల్గొంటారు. మీటింగ్ అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక 11వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ఎస్సీ సామాజిక వర్గ సభకు మోదీ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే ఈ సభ జరుగనుంది. స్వయంగా మంద కృష్ణ ఆహ్వానం మేరకే ఈ సభకు మోదీ హాజరవుతున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ సభకు బీసీలంతా తరలివచ్చి ధన్యవాదాలు చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటన చేస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ హేళన చేస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలంతా ఏకమై బీజేపీని గెలిపించాలని కోరారు.   

బీజేపీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి భేటీ 

ఎల్బీ స్టేడియంలో మోదీ సభకు జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఇతర నేతలు శనివారం పరిశీలించారు. మోదీ సభను సక్సెస్ చేయడం కోసం శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఈ సందర్భంగా పార్టీ తీరుపై  అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకపోవడంతోపాటు పార్టీ పరంగా ప్రాధాన్యత లభించడంలేదని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు వరుసగా బీఆర్ఎస్ లోకి క్యూ కడుతుండటంతో పార్టీ పరంగా వారికి న్యాయం చేస్తామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు సమాచారం.