వారాణాసి-ఢిల్లీకి మరో వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

వారాణాసి-ఢిల్లీకి మరో వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వారణాసి రైల్వేస్టేషన్ లో ప్రధాని మోదీ..  పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు.  ఈ వందే భారత్ రైలు వారణాసి నుంచి  ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, ఇటావా, తుండ్లా, అలీఘర్ మీదుగా ప్రయాణిస్తూ  దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంటుంది.

డిసెంబర్ 20వ తేదీ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారణాసి నుండి ఉదయం 6:00 గంటలకు బయలుదేరి.. 7.34 నిమిషాలకు ప్రయాగ్‌రాజ్‌కి, 9.30 నిమిషాలకు కాన్పూర్ సెంట్రల్‌కు, మధ్యాహ్నం 2.05నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ  రైలు న్యూఢిల్లీ నుండి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి, రాత్రి 7.12 గంటలకు కాన్పూర్ సెంట్రల్‌కు, రాత్రి 9.15 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు,  రాత్రి 11.05 గంటలకు  వారణాసికి చేరుకుంటుంది.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే యాత్రికులకు.. పారిశ్రామిక కేంద్రమైన రద్దీగా ఉండే కాన్పూర్, న్యూ ఢిల్లీ నగరాల మధ్య ప్రయాణించేవారికి  ప్రయోజనం చేకూరుతుంది. దాంతోపాటు ఈ ప్రాంతాల్లో సాంస్కృతిక, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.