11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల ప్రారంభం 11 రాష్ట్రాలలోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతుంది. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ వందే భారత్ రైళ్లను ప్రారంభం జరగనుంది.

వీటిలో ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ - చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా- హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా - భువనేశ్వర్, పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్  ఉన్నాయి. ఈ వందే భారత్ రైళ్లు తమ మార్గాల్లో అత్యంత వేగవంతంగా ప్రయాణించి, ప్రయాణికులకు గణనీయమైన సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి.

"దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన మత స్థలాల కనెక్టివిటీని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రూర్కెలా-భువనేశ్వర్, పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు, పూరీ - మదురైలోని ముఖ్యమైన మతపరమైన పట్టణాలను కలుపుతాయి. అలాగే, విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మార్గంలో నడుస్తుంది. ఇది తిరుపతి పుణ్య క్షేత్రానికి కనెక్టివిటీని అందిస్తుంది”అని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.

"ఈ వందే భారత్ రైళ్ల ప్రవేశం దేశంలో కొత్త ప్రమాణాల రైలు సేవలకు నాంది పలుకుతుంది. కవాచ్ సాంకేతికతతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధునాతన భద్రతా ఫీచర్లతో కూడిన ఈ రైళ్లు ఆధునిక, వేగవంతమైన, సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి" అని పీఎంఓ జోడించింది.