పిల్లల్లో ట్యాలెంట్‌‌‌‌ను వెలికితీయండి..డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించండి

పిల్లల్లో ట్యాలెంట్‌‌‌‌ను వెలికితీయండి..డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించండి
  • టీచర్స్ డే సందర్భంగా టీచర్లకు ప్రధాని మోదీ పిలుపు 
  • నేషనల్ టీచర్స్ డే అవార్డుల విజేతలతో ఇంటరాక్షన్
  • శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

 న్యూఢిల్లీ: విద్యార్థుల్లో దాగి ఉన్న ట్యాలెంట్‌‌‌‌ను టీచర్లు వెలికితీయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, పిల్లలు తమంతట తాము స్క్రీన్‌‌‌‌ టైమ్‌‌‌‌(మొబైల్ ఫోన్‌‌‌‌లు వినియోగించే సమయం) తగ్గించుకునేలా సాయం చేయాలని సూచించారు. పిల్లలను తరగతి గదులకే పరిమితం చేయకుండా, వారి ఆసక్తులను అన్వేషించేలా చేయాలని.. ఇందుకోసం క్రియేటివిటీతో కూడిన యాక్టివిటీస్‌‌‌‌ నిర్వహించాలని చెప్పారు. టీచర్స్ డేను పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసమైన 7, లోక్‌‌‌‌కల్యాణ్ మార్గ్‌‌‌‌లో ‘నేషనల్ టీచర్స్ అవార్డ్స్‌‌‌‌ 2026’ విజేతలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. 

టీచర్లతో ప్రధాని సంభాషణలకు సంబంధించిన వీడియోను పీఎంవో శనివారం రిలీజ్ చేసింది. ఈ సమావేశంలో టీచర్లు తమ అనుభవాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల ఆకాంక్షలు, పిల్లల నైపుణ్యాల అభివృద్ధికి తాము ఉపయోగించే విధానాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పిల్లల స్క్రీన్ టైమ్‌‌‌‌ను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘‘ఇప్పుడు  పెద్ద నగరాలలో లేదా యూనివర్సిటీలలో డ్రగ్స్ వాడకం రహస్యమేం కాదు. ఆ విషయంలో టీచర్లు అవగాహన కల్పించాలి. పిల్లలను గమనిస్తుండాలి’’ అని చెప్పారు. 

టీచర్లు పుస్తకాలు, సిలబస్ నుంచి బయటపడాలని.. పిల్లల జీవితాల్లోకి ప్రవేశించాలన్నారు. ‘‘బాల్యాన్ని చావనివ్వకూడదు. బాల్యాన్ని సజీవంగా ఉంచే అతిపెద్ద పని ఉపాధ్యాయుడే చేయగలడు” అని ఆయన సూచించారు. కాగా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్‌‌‌‌ఎస్)తో పేద కుటుంబాల పిల్లలు కూడా ఎన్‌‌‌‌ఐటీ, ఐఐటీ కలలు కంటున్నారని.. మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారని ఓ టీచర్ ప్రధాని మోదీకి చెప్పారు.

పాలసీ పారాలైసిస్ నుంచి.. డైనమిజం వైపు.. 

భారత్ 2013 నాటి పాలసీ పారాలైసిస్ నుంచి పాలసీ డైనమిజం వైపు చాలా దూరం ప్రయాణించిందని.. కానీ దేశాన్ని 'ఫ్రాజైల్ 5' ఎకానమీల జాబితాలోకి నెట్టడానికి బాధ్యులైన వారు ఇప్పుడు 7.8 శాతం జీడీపీ వృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. శనివారం ఢిల్లీ యూనివర్సిటీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో మోదీ ప్రసంగించారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఈ కాలేజీకి వచ్చానని.. ఇప్పుడు 13 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రసంగిస్తున్నానని గుర్తు చేసుకున్నారు. మోదీ తన స్పీచ్​లో ఓజీ వంటి జెన్ జీ ఫ్రెండ్లీ పదాలను, 'ధురంధర్' సినిమా ప్రస్తావనను జోడించారు. శ్రీరామ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఓజీలు అని, వాళ్లు ధురంధరులు కాకపోవచ్చు కానీ సంచలనం సృష్టించారని అన్నారు.