వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ

వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన మోడీ

సికింద్రాబాద్ – వైజాగ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ ప్రారంభమైంది. ప్రధాని మోడీ  వర్చువల్గా  హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై,  కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహుమూద్ అలీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. 

ఈ రైలుతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో వందే భారత్​ రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. వారంలో ఆరు రోజులు దీన్ని నడుపుతారు.  సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు సర్వీస్​ ఉంటుంది.  రైలు టికెట్‌ బుకింగ్స్​ను శనివారమే ప్రారంభించారు. దేశంలో ఇది ఎనిమిదో వందే భారత్‌ రైలు. దక్షిణ భారత దేశంలో ఇది రెండో సర్వీస్‌. ఇప్పటికే చెన్నై నుంచి  మైసూరును కనెక్ట్‌ చేస్తూ ఒక వందే భారత్‌  ట్రైన్​ నడుపుతున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం వైజాగ్‌కు చేరుకుంటుంది. సోమవారం ఉదయం 5.45 గంటలకు వైజాగ్‌లో ప్రారంభమై.. మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అదే రోజు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది.

ఇయ్యాల 23 స్టేషన్లలో..!

వందే భారత్​ రైలు ప్రారంభం సందర్భంగా ఆదివారం 23 స్టేషన్లలో ఇది ఆగనుంది. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆపుతారు. రెగ్యులర్‌ సర్వీసుల్లో మాత్రం మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుందని అధికారులు చెప్పారు. 

స్వదేశీ టెక్నాలజీతో..!

14 ఏసీ చైర్‌కార్‌ కోచ్‌లతో కూడిన వందే భారత్​ రైలులో 1,128 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశముంది. రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ చైర్‌కార్‌ కోచ్‌లు ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రిజర్వేషన్‌ సిస్టం అందుబాటులోకి తెచ్చారు. ఆధునిక స్వదేశీ సాంకేతికత, మెరుగైన ఫీచర్లతో ఈ రైలును సిద్ధం చేశారు. ట్రైన్‌ ఫ్లాట్‌ఫాంపై ఆగగానే ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ డోర్‌లు వాటికవే తెరుచుకుంటాయి. రైలు బయల్దేరడానికి ముందు మూసుకుంటాయి. ప్రయాణికులకు మెరుగైన సీటింగ్‌ సదుపాయం కల్పించారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లోని కూర్చీల్లో ప్రయాణికులు చుట్టూరా తిరిగే సౌకర్యం ఉంది. ఎమర్జెన్సీ అలారం, ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటితో ప్రయాణికులు అత్యవసర సందర్భాల్లో రైల్‌ సిబ్బందితో మాట్లాడుకోవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని కోచ్‌లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య నడుపుతున్న ఈ ట్రైన్‌తో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. 

సికింద్రాబాద్​నుంచి విశాఖకు రూ. 1,665

వందేభారత్​ రైలు టికెట్ల వివరాలను అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి బుకింగ్స్​ అందుబాటులోకి వచ్చాయి. చైర్​ కార్​ చార్జీలు సికింద్రాబాద్​నుంచి విశాఖపట్నానికి రూ. 1,665గా... విశాఖ నుంచి సికింద్రాబాద్​కు రూ. 1,720గా నిర్ణయించారు. 

చైర్​ కార్​ చార్జీలు ఇట్లా..!
సికింద్రాబాద్ టు వరంగల్ : రూ.520
సికింద్రాబాద్ టు ఖమ్మం: రూ.750
సికింద్రాబాద్ టు విజయవాడ : రూ. 905
సికింద్రాబాద్ టు రాజమండ్రి:  రూ.1,365
సికింద్రాబాద్ టు విశాఖపట్నం: రూ.1,665
ఎగ్జిక్యూటివ్​ చార్జీలు ఇట్లా..!
సికింద్రాబాద్ టు వరంగల్ : రూ.1,005
సికింద్రాబాద్ టు ఖమ్మం: రూ.1,460
సికింద్రాబాద్ టు విజయవాడ : రూ. 1,775
సికింద్రాబాద్ టు రాజమండ్రి:  రూ.2,485
సికింద్రాబాద్ టు విశాఖపట్నం: రూ.3,120