- ‘డోలు డోలు డోల్.. డోలమ్మ డోల్ డోల్’ సాంగ్‌తో గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మహిళలు
- చప్పట్లు కొడుతూ ఫిదా అయిన ప్రధాని
హైదరాబాద్, వెలుగు: జీ 20 లీడర్స్ సమిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సౌతాఫ్రికా వెళ్లారు. అక్కడ ఆయన మూడురోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం జొహెన్నస్‌బర్గ్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. కళాకారులు ఆయనకు గ్రాండ్ వెల్కమ్చెప్పారు. మహిళా కళాకారులు వీ6 న్యూస్ బోనాల సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ.. మోదీకి స్వాగతం పలికారు. ‘డోలు డోలు డోల్.. డోలమ్మ డోల్ డోల్’ అంటూ మహిళలు చేసిన నృత్యానికి మోదీ ఫిదా అయ్యారు. చప్పట్లు కొడుతూ మహిళలను అభినందించారు. తనకు లభించిన ఈ స్వాగత వీడియోను ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
2017లో అలరించిన బోనాల పాట
విదేశాల్లో ఉండే తెలంగాణ ప్రజలు ఏ వేడుక చేసినా.. పండుగ నిర్వహించినా.. వీ6 బోనాల పాటలే వినిపిస్తున్నాయి. ప్రతి వేడుకకు వీ6 రూపొందించిన బోనాలు, బతుకమ్మ పాటలే నిండుదనం ఇస్తున్నాయి. బోనాలు, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రతి ఏడాది సరికొత్త పాటతో వీ6 ప్రజలను అలరిస్తున్నది. ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ‘డోల్డోల్.. డోలమ్మ డోల్ డోల్..” పాటను 2017లో ప్రసారం చేసింది. ఈ పాట 220 మిలియన్స్ (22 కోట్ల) వ్యూస్ తో ప్రపంచంలోనే టాప్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.
