
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న “అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ”కు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు చీఫ్ గెస్టుగా హాజరైన మోదీ.. ఐదు రోజుల వ్యవధిలోనే మరోసారి హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పుడు ఎస్సీల్లోని మాదిగలు, అందులోని ఉప కులాల మద్దతును రాబోయే ఎన్నిక్లలో బీజేపీకి కూడగట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాత్మకంగా మోదీ సభను ఏర్పాటు చేసింది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మాదిగలు, అందులోని ఉప కూలాల రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యపై ఈ సభలో మోదీ ప్రకటన చేయనున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతున్నది.
ఈ సభ సక్సెస్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. పూర్తి బాధ్యతలను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకే అప్పగించింది. సభకు కనీసం లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నందున మాదిగలను బీజేపీ వైపు ఆకర్షించడంలో ఈ సభ ఎంతో కీలకమవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నార
మోదీ షెడ్యూల్ ఇది
శనివారం సాయంత్రం 4.45 గంటలకు మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సభకు చేరుకుంటారు. సాయంత్రం 5.40 గంటల వరకు సభలోనే ఉండనున్నారు. సభ నుంచి 5.45కు బయలుదేరి 5.55 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. 40 నిమిషాల పాటు సభలో మాట్లాడనున్నారు.