ఏఐ, డీప్​ఫేక్.. మిస్​యూజ్ కావొద్దు: మోదీ

ఏఐ, డీప్​ఫేక్.. మిస్​యూజ్ కావొద్దు: మోదీ
  • నైపుణ్యంలేని వ్యక్తుల చేతుల్లో ఉంటే ముప్పు
  • బిల్ గేట్స్​తో ‘చాయ్ పే చర్చా’ లో ప్రధాని నరేంద్ర మోదీ
  • తక్కువ ధరకే సర్వైకల్  క్యాన్సర్ టీకా డెవలప్  చేస్తం
  • భారతీయ బాలికలందరినీ ఆ మహమ్మారి బారి నుంచి కాపాడుతామని వెల్లడి

న్యూఢిల్లీ: నైపుణ్యంలేని, అన్ ట్రైన్డ్  వ్యక్తుల చేతుల్లో ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ ఉంటే మిస్ యూజ్  అయ్యే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మైక్రోసాఫ్ట్  సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ దాత బిల్ గేట్స్ తో ‘చాయ్ పే చర్చా’ లో మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్  టెక్నాలజీ వంటి అంశాలపై మాట్లాడుకున్నారు. టెక్నాలజీతో లాభాలు ఉన్నా ముప్పు కూడా పొంచి ఉందని మోదీ అన్నారు. ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్  టెక్నాలజీని కొందరు మిస్ యూజ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు ఏఐ ద్వారా జనరేట్  చేసిన కంటెంట్ పై గుర్తులు వేయాలని సూచించారు. తమ పౌరుల లబ్ధి కోసం టెక్నాలజీని మరింత అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారత్  ముందుడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సర్వైకల్  క్యాన్సర్​పై రిసర్చ్ కోసం నిధులిస్తం

దేశంలో బాలికలను సర్వైకల్  క్యాన్సర్  మహమ్మారి బారి నుంచి కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం వచ్చే కొద్ది రోజుల్లో అతి తక్కువ ధరకే సర్వైకల్  క్యాన్సర్  టీకాను అభివృద్ధి చేసేందుకు, ఆ క్యాన్సర్ పై రీసెర్చ్  చేసేందుకు సైంటిస్టులకు నిధులు అందిస్తామని ఆయన తెలిపారు. మూడోసారి కూడా కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే, భారతీయ బాలికలను సర్వైకల్  క్యాన్సర్  నుంచి రక్షించడానికి రీసెర్చ్​పై భారీగా పెట్టుబడులు పెడతామని మోదీ చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ తరహాలో సర్వైకల్  వ్యాక్సినేషన్​ను కూడా విజయవంతం చేస్తామన్నారు. ‘అంతా కలిసికట్టుగా పోరాడితేనే కరోనాను ఓడించగలమని, సేఫ్టీ ప్రొటోకాల్స్  పాటించాలని ప్రజలకు వివరించా. అన్ని రూల్స్ పాటించడంతో ప్రజలకు నాపై విశ్వాసం ఏర్పడింది. కరోనాపై పోరులోఅందరినీ కలిపేందుకు ప్రజలు మద్దతిచ్చారు’ అని మోదీ చెప్పారు. హెల్త్​కేర్  రంగంలో టెక్నాలజీ వాడడాన్ని తానెంతో ఇష్టపడతానని మోదీ తెలిపారు. దేశంలోని గ్రామాల్లో 2 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను తమ ప్రభుత్వం నిర్మించిందని, వాటిని టెక్నాలజీ సాయంతో ఆస్పత్రులతో నేరుగా అనుసంధానించామని వెల్లడించారు. 

టెక్నాలజీ ద్వారా మహిళా సాధికారత

‘నమో డ్రోన్​ దీదీ’ వంటి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా లింగ సమానత్వం, ఆర్థిక సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం గ్రామీణ మహిళలకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి వారి జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ గ్యాప్​ను పూడ్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. కాగా, గ్రామీణులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడం, మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయడంపై బిల్  గేట్స్ ప్రశంసలు కురిపించారు.