పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ (95) మృతదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకుని నివాళులర్పించారు. ప్రకాష్ సింగ్ బాదల్ మృతి చెందడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ప్రధాని అన్నారు. తాను ఆయనతో చాలా దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్నానని ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని మోడీ అన్నారు.
https://twitter.com/ANI/status/1651125450851364864
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ (95) స్వల్ప అస్వస్థతతో ఏప్రిల్ 25మంగళవారం రోజున మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 27 గురువారం ముక్తసర్ జిల్లాలోని అతని స్వస్థలమైన బాదల్‌లో జరుగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రకాశ్ సింగ్ బాదల్ 1927, డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జన్మించారు. బాదల్ కు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్.
30 ఏళ్ల వయసులో 1957లోనే తొలిసారి ప్రకాశ్‌సింగ్ బాదల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 43 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు. చివరిసారిగా బాదల్ 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలి ఓటమి, ఈవే చివరి ఎన్నికలు కావడం గమనార్హం.