డిజిటలైజేషన్​లో ముందున్నం..ఐటీ రంగంలో సంస్కరణలతోనే

డిజిటలైజేషన్​లో ముందున్నం..ఐటీ రంగంలో సంస్కరణలతోనే

న్యూఢిల్లీ: టెక్నాలజీపరంగా ఇండియా ఎంతో అభివృద్ధి చెందిందని, తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. డిజిటలైజేషన్​లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఐటీ రంగంలో చేపట్టిన సంస్కరణలతోనే ఇది సాధ్యమైందని వివరించారు. ‘జీ 20 డెవలప్​మెంట్ మినిస్టర్స్ మీటింగ్’ సందర్భంగా సోమవారం ప్రధాని మోడీ తన స్పీచ్​ను వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ‘‘డేటాపరమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సమర్థవంతమైన విధానాలు ఎంతో అవసరం. పబ్లిక్​ సర్వీస్​ డెలివరీకి హై క్వాలిటీ డేటా కీలకం. ప్రజలకు సాధికారత కల్పించడానికి, డేటాను అందుబాటులో తీసుకురావడానికి సాంకేతికత ఒక సాధనంగా ఉపయోగించబడుతున్నది” అని మోడీ అన్నారు. గ్లోబల్​ సౌత్​కు అభివృద్ధి ప్రధాన సమస్య అని అన్నారు.

ప్రజల జీవనశైలి మెరుగుపడింది

భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచమంతా ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం ఎదుర్కొన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఎవరూ వెనుకబడిపోకుండా చూసుకోవాలని, అందరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. దీని కోసం కార్యాచరణ ఎంతో ముఖ్యమని ప్రకటించారు. ఇండియాలో అభివృద్ధికి నోచుకోని వందకు పైగా జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మెరుగుపర్చడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ అభివృద్ధి నమూనాలపై అధ్యయనం చేయాలని జీ 20 డెవలప్​మెంట్ మంత్రులను కోరుతున్నట్లు తెలిపారు. నదులు, చెట్లు, పర్వతాలు, ప్రకృతిలోని అన్ని అంశాలపట్ల ఇండియాకు ఎంతో గౌరవం ఉందన్నారు. గతేడాది యూఎన్ సెక్రటరీ జనరల్​తో కలిసి మిషన్​ లైఫ్ – లైఫ్ స్టైల్  ప్రారంభించినట్లు మోడీ గుర్తుచేశారు.