మన ఆతిథ్యం గుర్తుండిపోవాలె.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచనలు

మన ఆతిథ్యం గుర్తుండిపోవాలె..   కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచనలు

న్యూఢిల్లీ :  జీ20 సమిట్​కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో రెండురోజుల పాటు జరిగే సమిట్​కు జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. విదేశీ ప్రతినిధులను ఎయిర్ పోర్టుల వద్ద రిసీవ్ చేసుకోవడం, సదస్సు వేదిక వద్ద పాటించాల్సిన నియమాలు, ఇతర అంశాలపై బుధవారం కేంద్ర మంత్రులతో ప్రధాని మీటింగ్ నిర్వహించారు. సమిట్​లో చేయాల్సిన, చేయకూడని అంశాలను వివరించారు. 

మంత్రులు తమ కార్లలో నేరుగా పార్లమెంట్ కాంప్లెక్స్ వెళ్లాలని, అక్కడి నుంచి షటిల్ సర్వీస్ వెహికల్స్​లో భారత్ మండపానికి చేరుకోవాలని చెప్పారు. అలాగే, ప్రతినిధులను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లే మంత్రులు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రధాని సూచించారు. వివిధ దేశాల భాషలను అర్థం చేసుకునేందుకు, ఇతర వివరాల కోసం జీ20 మొబైల్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలన్నారు. శనివారం సాయంత్రం 6.30కు భారత్ మండపంలో డిన్నర్​కు హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచే షటిల్ సర్వీస్ వెహికల్స్ లో రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.  

సీడీసీ గైడ్ లైన్స్ పాటించనున్న బైడెన్ 

జీ20 సమిట్​లో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీకి రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా గైడ్ లైన్స్ పాటిస్తారు. బైడెన్ భార్య జిల్ బైడెన్​కు ఇటీవల కరోనా పాజిటివ్ రాగా, ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో బైడెన్​తో సహా ఆయన టీంలోని అందరూ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్ లైన్స్ ను ఫాలో కానున్నారని అధికారులు వెల్లడించారు. బైడెన్ కు నెగెటివ్ వచ్చినందున జీ20 సమిట్ లో పాల్గొనడంతోపాటు వియత్నాంలోనూ ఆయన పర్యటన యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. 

భారత్ మండపం ముందు నటరాజ విగ్రహం 

భారత దేశ ప్రాచీన కళానైపుణ్యానికి, సంప్రదాయాలకు నటరాజ విగ్రహం ఒక నిదర్శనంలా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. జీ20 సమిట్ జరగనున్న భారత్ మండపం ముందు ఏర్పాటు చేసిన భారీ నటరాజ విగ్రహం గురించి ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ చేసిన ట్వీట్ కు ప్రధాని బుధవారం స్పందించారు. మన దేశ సుసంపన్నమైన మన దేశ చరిత్ర, సంస్కృతికి భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అద్భుతమైన ఈ విగ్రహం జీవం పోసినట్లు ఉందని పేర్కొన్నారు. ‘‘అష్టధాతువులతో తయారైన ఈ విగ్రహం 27 అడుగుల పొడవు, 18 టన్నుల బరువు ఉంది. దీనిని తమిళనాడుకు చెందిన ప్రముఖ శిల్పి రాధాకృష్ణన్ స్థపతి, ఆయన టీం సభ్యులు 7 నెలల్లో పూర్తి చేశారు. రాధాకృష్ణన్ పూర్వీకులు చోళుల కాలం నుంచీ 34 తరాలుగా శిల్పాలు తయారు చేస్తున్నారు. ఈ నటరాజ విగ్రహం కాస్మిక్ ఎనర్జీ, క్రియేటివిటీ, పవర్ కు సంకేతం. జీ20 సమిట్ వద్ద ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది” అని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంస్థ తన ట్వీట్ లో పేర్కొంది.

బ్యానర్లు, పెయింటింగ్స్ ఏర్పాటు   

జీ20 సమిట్ సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కట్టడాల ఫొటోలతో 450 భారీ బ్యానర్లను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎర్రకోట, హుమాయున్ టూంబ్, లోటస్ టెంపుల్, ఇతర హెరిటేజ్ సైట్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. సమిట్ సందర్భంగా ఢిల్లీని అందంగా ముస్తాబు చేయడం కోసం మన దేశ సంస్కృతిని చాటేలా రోడ్ల పక్కన వాల్ పెయింటింగ్స్ కూడా వేయించినట్లు పేర్కొంది. జాబిల్లిపై చంద్రయాన్–3 ల్యాండింగ్ వంటి థీమ్ లు కూడా ఇందులో ఉన్నాయని వెల్లడించింది. బ్యానర్లలో జీ20 లోగో, వసుదైక కుటుంబం థీమ్ కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.  

మిల్లెట్ థాలీ.. లిట్టి చోఖా

దేశాధినేతలు, గెస్ట్​లు, వీవీఐపీలకు నోరూరించే భారతీయ వంటకాలను వడ్డించనున్నారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్స్ ఇయర్​గా ప్రకటించినందున మిల్లెట్స్ వంటకాలను ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తో పాటు ఇతర దేశాల ప్రతినిధులకు మిల్లెట్స్ థాలీని వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజ్ హోటల్స్ గ్రూప్ వెల్లడించింది. జీ20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి భారత్ మండపంలో ఇచ్చే విందుకు వంటకాలను ఐటీసీ హోటల్స్ గ్రూప్ సిద్ధం చేస్తోంది. మిల్లెట్స్ థాలీతో పాటు అమర్ నాథ్ లడ్డూలు, కాజు పిస్తా రోల్, రాగి బాదం పిన్ని, రాగి పనియారం, బజ్రీ కీ ఖీర్, అవకాడో సలాడ్, లిట్టి చోఖీ వంటి దాదాపు 500 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన ఐరిస్ జైపూర్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన వెండి కంచాలు, గ్లాసులు, చెంబులు, ఇతర వస్తువులతో గెస్ట్​లకు డిన్నర్ అరేంజ్ చేయనున్నారు. దాదాపు 15 వేల వెండి వస్తువులను 200 మంది కళాకారులు తయారు చేశారని అధికారులు తెలిపారు. 

రిషి సునాక్​కు గ్రాండ్ వెల్కం 

జీ20 సమిట్ కు వస్తున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు ఢిల్లీలో గ్రాండ్ వెల్కం చెప్పేందుకు ఆయన బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబీ మ్యూజిక్ తో నాన్ స్టాప్ డ్యాన్సింగ్ ఈవెంట్ తో ఆయనకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. రిషి ఇంగ్లాండ్​లోని సౌతాంప్టన్ లో జన్మించారు. సునాక్ పూర్వీకులు పంజాబ్ కు చెందిన వారు కాగా, ఆయన భార్య అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి కూతురు. దీంతో అటు పంజాబీ, ఇటు కర్నాటక ట్రెడిషన్స్ తో రిషి దంపతులకు వెల్ కం చెప్పేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీ20 సమిట్ సందర్భంగా రిషి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 

బ్రిటన్​కు లాభమైతేనే డీల్..

ఇండియాతో ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) తమకు లాభదాయకంగా ఉంటేనే ఆమోదం తెలుపుతామని రిషి సునాక్ చెప్పారు. జీ20 సమిట్ నేపథ్యంలో రిషి తన కేబినెట్ మినిస్టర్లతో ప్రత్యేకంగా మంగళవారం సమావేశమయ్యారు. ఎఫ్టీఏపై ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఇప్పటివరకూ 12 రౌండ్ల చర్చలు ముగిశాయని ఆయనకు అధికారులు వివరించారు.