మే10న రూ.7,823 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం

మే10న రూ.7,823 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం
  • పరేడ్​ గ్రౌండ్స్​ సభకు తరలిరావాలని ఎన్వీ సుభాష్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఈ నెల10న తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్​చార్జి ఎన్వీ.సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని పరేడ్​గ్రౌండ్స్​లో  నిర్వహించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. పీఎం మిత్ర స్కీం కింద వరంగల్ గడ్డపై రూ.1,695 కోట్లతో నిర్మించిన కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్ పార్క్ ను పీఎం జాతికి అంకితం చేయనున్నారని, దీని ద్వారా లక్ష మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

పేదల వైద్యం కోసం రూ.2 వేల కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ ను నిర్మించామన్నారు. రూ.10కే పెద్ద డాక్టర్ల వైద్యం అందుతుందని, ప్రైవేట్​హాస్పిటళ్లలో రూ.వేలల్లో ఖర్చయ్యే పరీక్షలు ఇక్కడ రూ.వందల్లోనే పూర్తవుతాయని పేర్కొన్నారు.  కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తుంటే రాష్ట్రంలోని కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అన్నీ తెలుసని, రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఓటు శాతమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.