సౌతిండియా ఎన్డీయే ఎంపీలతో మోదీ భేటీ.. 2024 ఎన్నికలపై దిశానిర్దేశం

సౌతిండియా ఎన్డీయే ఎంపీలతో మోదీ భేటీ.. 2024 ఎన్నికలపై దిశానిర్దేశం

న్యూఢిల్లీ, వెలుగు: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సౌతిండియా ఎంపీలతో బుధవారం భేటీ అయ్యారు. ఇందులో ఏపీ, తెలంగాణ, కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీలు, తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావు, ఏపీ నుంచి జీవీఎల్ నర్సింహారావు హాజరయ్యారు.

 దక్షిణాది నుంచి మొత్తం 48 మంది ఎంపీలు ఉండగా.. కర్నాటక నుంచి 25 మంది లోక్ సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశంలో 2024 ఎన్నికలపై ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధించాలని నిర్దేశించారు. ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్​లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. 

మీటింగ్ అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని డిన్నర్ చేశారు. ఇందులో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎంపీలతోనూ మోదీ భేటీ అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంత ఎంపీలతో మోదీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా ఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. గురువారం బీహార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎంపీలతో  మీటింగ్ జరగనుంది.