బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలి..అన్ని రాష్ట్రాలకు పీఎం సూచన

బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలి..అన్ని రాష్ట్రాలకు పీఎం సూచన
  • పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిత్యావసరాల సరఫరాలో అంతరాయం  కలగకుండా చూడండి
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేయండి
  • టీమిండియా స్ఫూర్తితో కదులుదాం అంతర్జాతీయ సంక్షోభాన్ని కరోనా తరహాలో ఎదుర్కొందాం
  • యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు
  • తీర ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయండి
  • గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక  హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయండి
  • రాష్ట్రాల్లో ఇథనాల్ బ్లెండింగ్ వేగవంతం చేయాలని సలహాఅన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో దేశంలో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్​పై ఉక్కుపాదం మోపాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు. పెట్రోల్​, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాస్​సహా నిత్యావసర వస్తువుల సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, అక్రమ నిల్వలు (హోర్డింగ్), అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడకుండా ముందస్తు వ్యూహాలు అనుసరించాలని  సూచించారు. ‘‘పరిస్థితి డైనమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. అందుకే నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం కీలకం” అని పేర్కొన్నారు. సమాచార మార్పిడిలో జాప్యం ఉండకూడదని, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగుదామని, కరోనా​తరహాలో అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.  యుద్ధం కారణంగా దేశంలో చమురు, వంట గ్యాస్ కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని, దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతలు, దేశంపై దాని ప్రభావం, పరిణామాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సమావేశమయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు నారా చంద్రబాబునాయుడు (ఏపీ),  యోగి ఆదిత్యనాథ్ (యూపీ), భగవంత్ మాన్ (పంజాబ్), భూపేంద్ర పటేల్​(గుజరాత్), ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్లా (జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సుఖ్విందర్​సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుఖు (హిమాచల్​ప్రదేశ్), పెమా ఖండూ (అరుణాచల్​ప్రదేశ్)  సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీకి హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. 


పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా..ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్‌‌‌‌ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ పరిస్థితి వల్ల తలెత్తే ఏవైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. కాగా,  ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి  ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నందున వారికి మినహాయింపు ఇచ్చారు.  అయితే, ఆయా రాష్ట్రాల సీఎస్‌‌‌‌లతో కేబినెట్‌‌‌‌ సెక్రటేరియెట్ విడిగా సమావేశం నిర్వహించనున్నది. 

రాష్ట్రాలకు మోదీ కీలక సూచనలు

ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు.  మార్చి 23న లోక్‌‌‌‌సభలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ, ఈ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంతర్జాతీయ సంక్షోభం వేళ అందరం అప్రమత్తంగా ఉందామని పిలుపునిచ్చారు. కొవిడ్ మహమ్మారిని ఏ విధంగానైతే ఐకమత్యంతో ఎదుర్కొన్నామో, ఇప్పుడు ఈ  సంక్షోభాన్ని కూడా అదే స్ఫూర్తితో ఎదుర్కోవాలని కోరారు.  సరిహద్దులు, తీరప్రాంతాలు, సైబర్ సెక్యూరిటీతోపాటు వ్యూహాత్మక ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని భద్రతా సంస్థలను ఆదేశించారు. యుద్ధ సమయంలో శత్రు దేశాల హ్యాకర్లు మన దేశంలోని పవర్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలు, టెలికాం నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లపై సైబర్ దాడులు చేసే ప్రమాదం ఉందని, రాష్ట్రాలు తమ ఐటీ సెక్యూరిటీని ఆడిట్ చేసుకోవాలని ప్రధాని ప్రత్యేకంగా హెచ్చరించారు. ఎర్రసముద్రం ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల సరుకు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వాణిజ్యానికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను అన్వేషించాలని, దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు పెరగకుండా చూడాలని కేంద్ర వాణిజ్య శాఖకు, రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. 

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కొందరు తప్పు డు ప్రచారాలు చేసే అవకాశం ఉందని, అలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. ఆన్‌‌‌‌లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిత్యా వసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారు, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై తక్షణమే చర్యలు తీసు కోవాలని సీఎంలను ఆదేశించారు.  ధరల పెరుగుదల, అక్రమ నిల్వలపై  కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌‌‌‌లను యాక్టివేట్ చేయాలని, అడ్మినిస్ట్రేటివ్ అలర్ట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఉండాలని తెలిపారు.  వానాకాలం సీజన్‌‌‌‌ సమీపిస్తున్న తరు ణంలో ఎరువుల నిల్వలు, పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా ముం దస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఇంధన లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. పశ్చిమాసియాలో సుమారు 90 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నందున, పరిస్థితి విషమిస్తే వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి  సిద్ధంగా ఉండాలని విదేశాంగ శాఖను ఆదేశించారు. గతంలో ఉక్రెయిన్, సూడాన్ సంక్షోభాల సమయంలో చేపట్టిన తరహాలోనే ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. పశ్చిమాసియాలో ఉన్న ప్రవాస భారతీయుల కోసం  ప్రత్యేక హెల్ప్‌‌‌‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని సీఎంలకు సూచించారు. నోడల్ ఆఫీసర్లను నియమించాలని, బాధిత కుటుంబాలకు సమాచారం అందించడానికి జిల్లా స్థాయి సహాయక వ్యవస్థలను రూపొందించాలన్నారు.  మన దేశం నుంచి పశ్చిమాసియాకు వెళ్లే వ్యవసాయ ఉత్పత్తులు (ముఖ్యంగా బాస్మతీ బియ్యం, పండ్లు) దెబ్బతినకుండా ఎగుమతిదారులకు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలి

 పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా డాలర్ బలపడే అవకాశం ఉన్నందున, మన రూపాయి విలువ పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలను (ఫారిన్‌‌‌‌ ఎక్స్చేంజ్​ రిజర్వ్స్‌‌‌‌) జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. చమురు ధరల పెరుగుదల ముప్పు పొంచి ఉన్నందున, రాష్ట్రాల్లో ఇథనాల్ బ్లెండింగ్ వేగవంతం చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని తెలిపారు. ఇది దీర్ఘకాలికంగా దేశానికి రక్షణ కవచంలా మారుతుందని పేర్కొన్నారు. మన దేశానికి వచ్చే సరుకు రవాణాలో ఎక్కువ భాగం సముద్ర మార్గం ద్వారానే జరుగుతుందని, కాబట్టి గుజరాత్ నుంచి కేరళ వరకు ఉన్న అన్ని ప్రధాన ఓడరేవుల వద్ద నిఘా పెంచాలని, సముద్రపు దొంగతనాలు, ఉగ్రవాద ముప్పులు పొంచి ఉండే అవకాశం ఉన్నందున కోస్ట్ గార్డ్‌‌‌‌తో రాష్ట్ర పోలీసులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. యుద్ధ పరిస్థితుల్లో సామాన్యులు బంగారం వైపు మొగ్గు చూపుతారని, దీనివల్ల మార్కెట్‌‌‌‌లో కరెన్సీ సర్క్యులేషన్‌‌‌‌పై ప్రభావం పడుతుందని చర్చించారు. స్టాక్ మార్కెట్లలో  ఇన్వెస్టర్లు ఆందోళన చెందకుండా సెబీ  ద్వారా అవగాహన కల్పించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాలని తెలిపారు. కేవలం ఆహార ధాన్యాలే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు పశ్చిమాసియా నుంచి నిలిచిపోతే  చిన్న తరహా పరిశ్రమలు (ఎంస్‌‌‌‌ఎంఈలు) దెబ్బతినే ప్రమాదం ఉన్నదని.. అలాంటి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని, ఇతర దేశాల నుంచి ముడి సరుకు తెచ్చుకునే మార్గాలను సుగమం చేయాలని సూచించారు.

కేంద్రం చర్యలను కొనియాడిన సీఎంలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులందరూ ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం, రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులను పెంచడం లాంటి నిర్ణయాలను స్వాగతించారు.. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌, ఎల్‌‌‌‌పీజీ తగినంత ఉండడంతో రాష్ట్రంలో పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. కేంద్రంతో సమన్వయంతో పనిచేయడానికి తాము సిద్ధమేనని సీఎంలు చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

కరోనా సమయంలో ‘ఆక్సిజన్’ ఎలాగో.. ఇప్పుడు ‘ఇంధనం’ అలా.. కొవిడ్ అప్పుడు ‘లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ భయం.. ఇప్పుడు ‘ధరల పెరుగుదల’ భయం.. అప్పుడు ‘మాస్క్-భౌతిక దూరం’.. ఇప్పుడు ‘అప్రమత్తత-ఐకమత్యం’ రెండు సందర్భాల్లోనూ ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తే మన ఆయుధం.
- ప్రధాని నరేంద్ర మోదీ