ఇక ఫోన్ నుంచే పోక్సో ఫిర్యాదు.. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో పోక్సో ఈ-బాక్స్‌‌ యాప్‌‌

ఇక ఫోన్ నుంచే పోక్సో ఫిర్యాదు.. గూగుల్ ప్లే స్టోర్‌‌‌‌లో పోక్సో ఈ-బాక్స్‌‌ యాప్‌‌
  • చిన్నారులపై లైంగిక దాడులైతే క్లిక్‌‌ చేసి కంప్లైంట్‌‌ చేసేలా ఆప్షన్స్
  • బాధిత కుటుంబాల రక్షణ, గోప్యతే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం
  • కేసు నమోదు సహా బాధితురాలికి పరిహారం అందించేదాకా ఫాలోఅప్​
  • కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాయి. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యుల వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి. 

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోక్సో ఈ బాక్స్‌‌‌‌’ సత్ఫలితాలను ఇస్తోంది. పరువుపోతుందనో లేక చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనో.. చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసేందుకు భయపడుతుంటారు. ఇలాంటి కేసుల్లో బాలికలపై జరిగే అఘాయిత్యాలపై స్పందించేందుకు, బాధితుల అభద్రతను పోగొట్టి.. గోప్యతను కాపాడేలా ఫిర్యాదు చేసే ‘పోక్సో ఈ బాక్స్’ యాప్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

జాతీయ స్థాయిలో ‘పోక్సో ఈ-బాక్స్‌‌‌‌’ ఫిర్యాదులు
బాధితురాలుసహా కుటుంబ సభ్యులతో ఫిర్యాదులు స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  ‘పోక్సో ఈ బాక్స్‌‌‌‌’ను రూపొందించింది.  జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌‌‌‌సీపీసీఆర్‌‌‌‌) ఆధ్వర్యంలో ఈ బాక్స్‌‌‌‌ను నిర్వహిస్తోంది. ఈ విధానంలో బాధితులు పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లకుండానే మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ద్వారానే తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయవచ్చు. 

ఈ బాక్స్‌‌‌‌యాప్‌‌‌‌ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదునూ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. ఘటన వివరాలు, అదనపు సమాచారాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాలకు ఒకేసారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పంపిస్తారు. అనంతరం బాలల సంరక్షణ అధికారులు పూర్తి పారదర్శకతతో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తారు. బాధితురాలికి, ఫిర్యాదు చేసిన వారికి రక్షణ కల్పిస్తుంటారు.

ఇలా ఫిర్యాదు చేయాలి 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘పోక్సో ఈ–బాక్స్’ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలి. యాప్‌‌‌‌డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌అనంతరం  ఓపెన్  చేశాక ఎరుపు రంగులో పోక్సో పేరుతో ఉన్న ఆప్షన్‌‌‌‌ను క్లిక్ చేయాలి. అందులో ప్లేగ్రౌండ్, షాప్, రోడ్డు, స్కూల్‌‌‌‌, ట్యూషన్, బ్లాక్‌‌‌‌మెయిల్, స్కూల్ బస్సు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు, ఇంటర్నెట్, ఫోను ఇలా వివిధ అంశాలు ఫొటోలతో కనిపిస్తాయి. 

ఈ బాక్స్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ క్లిక్‌‌‌‌లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన చిత్రంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేరు, మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు నమోదు చేసి ఘటన వివరాలు పొందుపర్చాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంచుతారు. లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో కమిషన్‌‌‌‌లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీలు, 1908 టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌లాంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వీటిలో ఫిర్యాదు చేయవచ్చు.