
ఇంఫాల్: ఆయుధగారాల నుంచి ఎత్తుకుపోయిన ఆయుధాలను స్వచ్ఛందంగా అందజేయాలని మణిపూర్‌లో ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛా వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కోరుతున్నారు. ఆయుధాలను సమర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశామని, వాటిలో ఆ వెపన్స్‌ను వదిలివెళ్లాలని సూచించారు. గత ఏడాది నుంచి మణిపూర్‌లోని ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లో మైతీ, కుకీ తెగల మధ్య హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. హింస చెలరేగినపుడు చాలామంది తమ ప్రాంతాల్లో ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
అధికారిక వర్గాల ప్రకారం ఆందోళనకారులు దొంగిలించిన 4,200 వెపన్స్‌ను ఇంకా గుర్తించలేకపోయారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వాటిని రికవరీ చేసేందుకు పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందు కోసం బలగాలు కూంబింగ్ కూడా చేపట్టాయి. దయచేసి ఆయుధాలు అప్పగించాలని కోరుతున్నారు. హింస చెలరేగినప్పటి నుంచి గత 11 నెలలుగా ఆయుధాల రికవరీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులు లూటీచేసిన 6 వేల ఆయుధాల్లో 1800 వెపన్స్ మాత్రమే సరెండర్ చేశారని అధికారులు తెలిపారు.
ఇంకా 4200 ఆయుధాలను రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ఉండడం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. ఎత్తుకుపోయిన ఆయుధాల్లో 303 రైఫిల్స్, మీడియం మెషిన్ గన్స్, ఏకే అసాల్ట్ రైఫిల్స్, ఇన్సాస్ లైట్ మెషిన్ గన్స్, రైఫిల్స్, ఎ16, ఎంపీ5 రైఫిల్స్ ఉన్నాయని తెలిపారు.
లైసెన్స్ ఉన్నవారు కూడా సరెండర్ చేయాలి
లైసెన్స్ ఉన్నవారు కూడా తమ ఆయుధాలను సమీపంలోని పోలీసు స్టేషన్లలో సరెండర్ చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకే ఈ ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఇక ఇంఫాల్ ఈస్ట్ లో బీజేపీ నేత ఇంటి సమీపంలో కూడా డ్రాప్ బాక్స్ పెట్టారు. ఎత్తుకుపోయిన ఆయుధాలను దయచేసి ఆ డ్రాప్ బాక్స్ లో వదిలివేయాలని ఇంగ్లిష్, మైతీ భాషల్లో రాసి బ్యానర్లు ఏర్పాటు చేశారు. వెపన్స్ సరెండర్ చేయడానికి వచ్చిన వారిని ఎలాంటి ప్రశ్నలు వేయబోమని అధికారులు హామీ ఇచ్చారు.
రెండు వర్గాల మధ్య హింస.. ఇద్దరు మృతి
మణిపూర్ లోని ఇంఫాల్ ఈస్ట్ లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాంగ్ పోప్కి జిల్లా సరిహద్దు సమీపంలో కాల్పులు జరిగాయని చెప్పారు. హింస నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలను తరలించారు.