బండెక్కితే కేసే..సీసీ కెమెరాలతో ఆటోమేటిక్ గా నంబర్ క్యాప్చర్

బండెక్కితే కేసే..సీసీ కెమెరాలతో ఆటోమేటిక్ గా నంబర్ క్యాప్చర్

హైదరాబాద్, వెలుగులాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్న సిటిజన్లపై పోలీసులు స్మార్ట్ టెక్నాలజీతో నజర్ పెట్టారు. రోడ్లపై తిరిగే వెహికల్స్ ను ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో గుర్తించి వయొలేషన్ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. సిటీ రోడ్లపైకి వచ్చే ప్రతీ వెహికల్ నూ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఉన్న సీసీ కెమెరాలు క్యాప్చర్ చేస్తున్నాయి. ఇలాంటి కెమెరాలు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని మెయిన్ జంక్షన్లలో 300కి పైగా ఉన్నాయి. గతంలో ఈ కెమెరాలు టూవీలర్స్ హెల్మెట్ లేకుండా వెళ్లినా, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా క్యాప్చర్ చేసేవి. జీవో నం. 45,46 ప్రకారం లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వెహికల్స్​ను క్యాప్చర్ చేసేలా పోలీసులు వాటి ప్రోగ్రామ్ సిస్టమ్ మార్చారు. అలా క్యాప్చర్​ అయిన నంబర్లపై లాక్ డౌన్ వయొలేషన్ కింద ట్రాఫిక్ చలాన్లు జనరేట్​ కావడంతోపాటు ఎంవీ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి.

లిఫ్ట్ ఇచ్చినా ఇబ్బందే..

లాక్ డౌన్ రూల్ ప్రకారం.. బైక్​పై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ఇద్దరు వెళ్తే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది. సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయిన ఫస్ట్ ఇమేజ్ నుంచి 3 కి.మీ దాటిన వెహికల్స్ ను గుర్తించి వయొలేషన్ ను రికార్డ్ చేస్తోంది.  ఇలా సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల్లో టూవీలర్స్ పై 54,476 కేసులు నమోదయ్యాయి.  ఎక్కువ కేసులు ఒకే రూట్లో ట్రావెల్ చేసిన వెహికల్స్​వే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. లాక్ డౌన్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎసెన్షియల్, ఎమర్జెన్సీ సర్వీసుల పేరుతో రోడ్డెక్కిన వాళ్ల బైక్ నంబర్లనూ సీసీ కెమెరాలు క్యాప్చర్ చేస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత వారు చూపించే ఆధారాలను బట్టి వయొలేషన్ కేసుల నుంచి మినహాయింపును పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినా లాక్ డౌన్ కేసుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు.