ఆలయాల్లో దేవుడి విగ్రహాలే టార్గెట్

ఆలయాల్లో దేవుడి విగ్రహాలే టార్గెట్

ఎల్బీనగర్, వెలుగు: ఆలయాల్లో దేవుడి విగ్రహాలే టార్గెట్​గా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన విగ్రహాలను కొంటున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఎల్బీనగర్ లో రాచకొండ సీపీ సుధీరాబాబు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన కరచా శివానంద(52) కొన్నాళ్లుగా నగరానికి వచ్చి వనస్థలిపురం ఎన్​జీవో కాలనీలో ఉంటున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వల్లపల్లి గ్రామానికి చెందిన షేక్ హామ్ షరీఫ్ (38) పరిచయం అయ్యాడు.

వీరు ఆలయాల్లో విగ్రహాలు చోరీలు చేయాలని డిసైడ్​ అయ్యారు. ఫిబ్రవరి 27న యాచారం మండలం గండ్లగూడలోని మల్లికార్జున స్వామి ఆలయంలో 4 టెంపుల్ బెల్స్, జూన్ 15న ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరగూడ మల్లన్న స్వామి ఆలయంలో అమ్మవారి పుస్తెలతాడు, 2 దీపం స్టాండ్లు, జూన్​ 24న ఉప్పల్​లోని మెట్రో క్యాష్, క్యారీ వద్ద పార్క్ చేసిన బైక్  చోరీ చేశారు. జూన్​ 29న సద్దుపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ పంచలోహ విగ్రహాలను, దుండుమైలారం అయ్యప్ప స్వామి గుడిలో పంచలోహ విగ్రహాలు, అయప్ప వెండి విగ్రహం, ఇతర పూజా వస్తువులను మాయం చేశారు.

వాటిని ఉప్పల్, భరతత్ నగర్ లో ఉన్న స్క్రాప్ వ్యాపారం చేసే అక్కపల్లి క్రాంతికుమార్ కు రూ.18,500కు అమ్మేశారు. జూన్​ 30న పోల్కంపల్లి గ్రామంలోని శివగంగ ఆలయంలో పెద్ద రాజు, పెద్దమ్మ విగ్రహాలను దొంగిలించారు. బుధవారం వీరు మంగలపల్లి చౌరస్తా నుంచి వెళ్తుండగా ఎల్బీనగర్ సీసీఎస్, ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల 36 వేల విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.