మార్కెట్లో నకిలీ శానిటైజర్స్..వాసన చూసి గుర్తుపట్టొచ్చు..

మార్కెట్లో నకిలీ శానిటైజర్స్..వాసన చూసి గుర్తుపట్టొచ్చు..

హైదరాబాద్, వెలుగు : కరోనా ఎఫెక్ట్ తో శానిటైజర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ముఠాలు నకిలీ శానిటైజర్లు తయారుచేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. క్వాలిటీ లేని కెమికల్ కంపోనెంట్లను ఉపయోగిస్తున్నాయి. హైదరాబాద్ లోని బాలానగర్, నాచారం, బాచుపల్లితోపాటు చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలు నకిలీ శానిటైజర్ల తయారీ కేంద్రాలుగా మారాయని టాస్క్ ఫోర్స్ దృష్టికి వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్​బోర్డు కూడా తనిఖీలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓల్డ్ సిటీలోనూ టాస్క్ ఫోర్స్ వరుస దాడుల్లో నకిలీ శానిటైజర్ తయారీదారులు దొరుకుతున్నారు. నకిలీ శానిటైజర్లు వాడితే చర్మం పగిలిపోతుందని స్కిన్ స్పెషలిస్ట్​లు చెబుతున్నారు.

ఘాటైన వాసన ఉంటేనే ఒరిజినల్

ఆల్కహాల్ పర్సంటేజీ 70 శాతానికి మించి ఉన్న శానిటైజర్లు మాత్రమే క్వాలిటీ గలవని.. వాటితోనే వైరస్ కంట్రోల్ అవుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ నివేథా సాహూ తెలిపారు. క్వాలిటీ శానిటైజర్ చేతులకు రాసుకునే క్రమంలో ఘాటైన వాసన వస్తుందని, స్మూత్​గా ఉండటంతోపాటు కొన్ని సెకండ్లలోనే ఆవిరైపోతుందని ఆమె చెప్పారు. నకిలీ శానిటైజర్లలో ఆల్కహాల్ కంపోనెంట్ లేకుండా నురగ వచ్చేలా గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇథనాల్ వంటి కెమికల్స్ యూజ్​చేస్తారని తెలిపారు. ఈ మిశ్రమం వైరస్​/బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు పనికి రాదన్నారు.

ప్యాకింగ్ లో మోసం

100 ఎంఎల్ శానిటైజర్​కు ధర 60 –80 రూపాయల్లోపే ఉంటుందని మెహిదీపట్నానికి చెందిన ఫార్మా డిస్ట్రిబ్యూటర్ నరేశ్​ సాగర్ తెలిపారు. ముఠాలు ప్యాకింగ్ టైమ్​లో కెమికల్ కంపోనెట్లను లేబుల్​పై తప్పుగా ప్రింట్ చేస్తున్నాయన్నారు.

టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డ ముఠాలు

  • మార్చి 17న  చర్లపల్లి, అబ్దుల్లాపూర్ మెట్ లో నకిలీ శానిటైజర్స్​ తయారీ కేంద్రాలపై  రాచకొండ ఎస్ వోటీ పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.40 లక్షల ముడిసరుకు, మెషీన్ ను స్వాధీనం చేసుకున్నారు.
  • 24న కాటేదాన్ లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 150 లీటర్ల నకిలీ శానిటైజర్ స్వాధీనం చేసుకున్నారు.
  • 26న మధుబన్ కాలనీలో శానిటైజర్స్ కల్తీ చేస్తున్న అగర్ బత్తీల వ్యాపారిని మైలార్ దేవ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
  • 27న మీర్ చౌక్ లో మురాద్ మహల్ మెడికల్ హాల్ లో నకిలీ శానిటైజర్లు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 188 నకిలీ శానిటైజర్లు స్వాధీనం చేసుకున్నారు.
  • ఈ నెల​9న ఓల్డ్ సిటీ రూప్ లాల్ బజార్ లోని ఓ మెడికల్ షాప్ కి నకిలీ శానిటైజర్లు సప్లయ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 580 శానిటైజర్లు స్వాధీనం చేసుకున్నారు.