నాంపల్లి అగ్నిప్రమాదం కేసులో.. ఫర్నిచర్ షాపు ఓనర్ అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

నాంపల్లి అగ్నిప్రమాదం కేసులో.. ఫర్నిచర్ షాపు ఓనర్ అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు

నాంపల్లి అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లలో మంటలు వ్యాపించి సెల్లార్ దట్టమైన పొగతో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఎదురయ్యింది. నిబంధనలకు సెల్లార్ మొత్తం స్టాక్ నింపడమే ప్రమాదానికి కారణమని నిర్దారించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఫర్నిచర్ షాపు ఓనర్ సతీష్ బచ్చాను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

ఈ ఘటనలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో బీఎన్ఎస్ 110 కింద కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్ కు ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాలు లేకపోవడం కారణంగానే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్దారించారు పోలీసులు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాధమికంగా గుర్తించమని తెలిపారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్. రెండు రోజుల క్రితమే బిల్డింగ్ లిఫ్ట్ రిపేర్ జరిగిందని.. అందులో వైరింగ్ సమస్య వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని అన్నారు. సెల్లార్ లో ఫర్నిచర్ స్టోర్ చేయడం వల్ల మంటలు తొందరగా వ్యాపించాయని అన్నారు. సెల్లార్ లో చిక్కుకున్నవారు పొగ వల్ల ఊపిరాడక మరణించారని అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు.