నమ్మలేని నిజం.. ఇది పచ్చి నిజం : 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకున్న యువతి

నమ్మలేని నిజం.. ఇది పచ్చి నిజం : 7 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకున్న యువతి

పెళ్లి అంటే ఒకసారి.. రెండు సార్లు.. లేదంటే మూడు, నాలుగు సార్లు చేసుకోవటం చూశాం.. విన్నాం.. ఇది మాత్రం షాకింగ్.. ఓ యువతి.. ఏడు అంటే 7 నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకున్నది.. ఇదెలా సాధ్యం.. పెళ్లి వేడుక అంటేనే ఓ నెల, రెండు నెలలు ఉంటుంది.. అలాంటిది ఆ యువతి 7 నెలల్లోనే.. 25 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నది.. ఎలా సాధ్యం అయ్యింది అనేది అందరికీ డౌట్ వస్తుంది.. ఇది పచ్చి నిజం.. పక్కా మోసం.. పక్కా స్కెచ్ ఇది.. మన దేశంలోనే.. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ నిత్య పెళ్లి కుతురు బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. అందరూ షాక్ అయ్యారు.. పూర్తి వివరాలు మీ కోసం..

యువతి పేరు అనురాధ. వయస్సు 23 ఏళ్లు. అనురాధ సొంత ఊరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్. ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంది. ఇంట్లో గొడవలతో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత.. ఈ యువతి పెళ్లి పేరుతో మోసాలు చేసే ఏజెంట్ల మాఫియాతో చేతులు కలిపింది. యువతి చూడటానికి అందంగా ఉంటుంది.. కొంచెం తెలివి ఉంది.. అంతకంటే ముఖ్యంగా అనుకువ, విధేయత చూపించటంలో సిద్ధహస్తురాలు. ఇదే ఆ ఏజెంట్లకు, యువతి అనురాధకు కలిసి వచ్చింది. వీళ్లందరూ ముఠాగా ఏర్పడి.. అనురాధను పెళ్లి కూతురుగా పరిచయం చేసి.. పెళ్లి తర్వాత జంప్ అయ్యేవారు. 

అనురాధ ఫొటోలను మ్యాట్రిమోనియల్ సైట్లతోపాటు లోకల్ పెళ్లి బ్రోకర్లకు ఇచ్చే వారు ఏజెంట్లు. ఈ ఏజెంట్లే యువతి అనురాధ కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లను టార్గెట్ చేసేవారు. రెండో పెళ్లిలోనూ.. ముఖ్యంగా 35, 40 ఏళ్ల వ్యక్తులను టార్గెట్ చేసేవారు. 

పేద కుటుంబం, మంచి కుటుంబం.. చదువుకున్న అమ్మాయి.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం కూడా చేస్తుంది అని నమ్మించేవారు. దీంతో పెళ్లి ఖర్చులు అన్నీ పెళ్లి కుమారుడి వాళ్లే పెట్టుకునే విధంగా మాట్లాడుకునే వారు. పెళ్లి ముహూర్తం తర్వాత చీరలు, నగలు పేరుతో 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి.. బంగారం, చీరలు అన్నీ కొనుగోలు చేసేవారు. పెళ్లి తర్వాత.. వారం, పది రోజుల్లో ఓ అర్థరాత్రి సమయంలో పెళ్లి కూతురు, ఏజెంట్ల అందరూ ఓ అర్థరాత్రి జంప్ అయ్యేవారు. 

ఆ తర్వాత వారం, 10 రోజుల్లో మరో పెళ్లి చేసుకునే వారు. అక్కడ కూడా అంతే.. పెళ్లయిన వారం, పది రోజులకు జంప్ అయ్యేవారు. ఓ ముఠా కొత్త పెళ్లి వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటే.. మరో ముఠా పెళ్లి తర్వాత జంపింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఇలా 7 నెలల్లో.. 25 పెళ్లిళ్లు చేసుకుని.. కోటి రూపాయల వరకు కొట్టేశారు.. 

రాజస్తాన్ మాధోపూర్ ప్రాంతానికి చెందిన శర్మ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ తో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. శర్మను పెళ్లి చేసుకున్న అనురాధ.. పది రోజుల తర్వాత ఇంట్లోని బంగారం, డబ్బు, చీరలతో ఇంటి నుంచి పారిపోయింది. 2025 ఏప్రిల్ 20వ తేదీన రిజిస్ట్రర్ మ్యారేజ్ జరగ్గా.. మే 2వ తేదీ నుంచి పరార్ అయ్యింది. విచారణ చేయగా.. భోపాల్ లో గబ్బర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. షాక్ అయిన శర్మ.. పోలీసులకు మొత్తం చెప్పేశాడు. 

దీంతో కొంత మంది పోలీసులు.. మఫ్టీలో.. మారు వేషాల్లో పెళ్లి కొడుకుగా అనురాధ అండ్ చీటింగ్ ముఠాను సంప్రదించారు. అంతే మొత్తం ముఠా బాగోతం బయటపడింది. నిత్య పెళ్లి కూతురు అనురాధతోపాటు రోష్ని, రఘుబీర్, గోలు, మజ్ బూత్ సింగ్, అర్జున్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి బంగారం, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.