నాగోల్ చోరీ నిందితులు దొరికారు...

నాగోల్ చోరీ నిందితులు దొరికారు...
  • 30 తులాల బంగారం, కిలో వెండి, 2 మొబైల్స్, బైక్ స్వాధీనం 

ఎల్బీనగర్, వెలుగు: నాగోల్​లో చోరీకి పాల్పడిన ఇద్దరు అంతర్​రాష్ట్ర దొంగలను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్ రావు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందిన కిన్నెర మధు(37) వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు ఏపీలోని బాపట్ల జిల్లా సంత మణుగూరు పరిటాలవారిపాలేనికి చెందిన ఉప్పుటూరి నవీన్ కుమార్  పరిచయమయ్యాడు. 

వీరిద్దరు కలిసి పలు చోరీలకు పాల్పడ్డారు. గత నెల 30న నాగోల్​ సాయినగర్ కాలనీలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్ ఇంట్లో చోరీ చేశారు. కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లో 30 తులాల బంగారు, కేజీ వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు మంగళవారం ఎల్బీనగర్ ప్రాంతంలో ఇద్దరిని అరెస్ట్​చేశారు. 

30 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, బైక్​, రెండు మొబైల్స్​ స్వాధీనం చేసుకున్నారు. నాగోలు పోలీస్ సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్ బాబు అభినందించారు. సమావేశంలో ఎస్సైలు శివనాగ ప్రసాద్, నర్సింహ, ఏఎస్సై రవి పాల్గొన్నారు.