బార్బెక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజన్.. 16మందికి అస్వస్థత

బార్బెక్యూ రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజన్.. 16మందికి అస్వస్థత

జనవరి 24న రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ కారణంగా 16 మంది కస్టమర్లు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో తమిళనాడులోని వెలాచ్చేరి పోలీసులు రెస్టారెంట్ యజమానిపై, ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. కుండ్రత్తూరుకు చెందిన ఎస్. షేక్ జలాలుద్దీన్ అనే వ్యక్తి 15 మంది కుటుంబ సభ్యులతో కలిసి పల్లవరంలో వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత విందు కోసం వెలచ్చేరిలోని కోల్ బార్బెక్యూ అనే రెస్టారెంట్‌కు వచ్చారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, కొందరికి వికారం, వాంతులయ్యాయి. మరికొంతమంది మూర్ఛపోయారు.

దీంతో వెంటనే మొత్తం 16 మందిని తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా.. వారిలో కొందరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. ఆ తర్వాత యజమాని, ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందరరాజ్ నేతృత్వంలోని బృందం రెస్టారెంట్‌ను తనిఖీ చేసి తదుపరి చర్యల కోసం ఆహార నమూనాలను తీసుకుంది.