ఆందోళనకారులపైకి భాష్ప వాయువు ప్రయోగించిన పోలీసులు

ఆందోళనకారులపైకి భాష్ప వాయువు ప్రయోగించిన పోలీసులు

అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ మంటలు రాష్ట్రాన్నీ తాకాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనను వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేస్తోన్న అభ్యర్థులు.. తాజాగా సికింద్రాబాద్ లోని రైల్వేస్టేషన్ లోనూ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశారు. రైలు బోగీలకు నిప్పటించడంతో అక్కడి వాతావరణం అంతా రణరంగంగా మారింది. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో  ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై, పరుగులు తీశారు. రైలు పట్టాలపై డబ్బాలు, ఇతర వస్తువులను చెల్లాచెదురుగా వేసి.. అక్కడే నిలిచి ఉన్న పలు రైలు బోగీలకు నిప్పటించారు. అంతే కాకుండా రాళ్లు, కర్రలు, రాడ్లతో... ఇలాఏది దొరికితే వాటితో దాడులు చేస్తూ ఆందోళనకారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దాడులు చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాలను అట్టుడుడికిస్తున్నారు. ఎంతో మంది పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఏం చేయలేని స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆందోళన కారులను చెదరగొట్టేదుకు పోలీసుల బాష్పవాయువు ప్రయోగించినట్టు తెలుస్తోంది. దాదాపు 8.30కు ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.