శాయంపేట చలివాగులో కానిస్టేబుల్‌‌ గల్లంతు

శాయంపేట చలివాగులో కానిస్టేబుల్‌‌ గల్లంతు
  • శాయంపేట మండలంలో ఘటన  
  • ఏఎస్పీ ఆధ్వర్యంలో గాలిస్తున్న పోలీసులు

శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా దామెర పోలీస్‌‌ స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌‌గా పని చేస్తున్న చెన్న రాజు(40) మంగళవారం సాయంత్రం శాయంపేట మండలంలోని కొప్పుల శివారులోని చలివాగు ప్రాజెక్ట్‌‌లో గల్లంతయ్యాడు. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. కానిస్టేబుల్‌‌ రాజు స్వగ్రామం ఆరెపల్లి కాగా కొప్పుల గ్రామంలోని అత్తగారింటికి టూ వీలర్‌‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో జోగంపల్లి‒కొప్పుల గ్రామాల మధ్య లో లెవెల్‌‌ వంతెనపై నుంచి చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా రాజు తన అత్తగారింటికి చేరుకోవాలని అలాగే పోనివ్వడంతో వరదలో కొట్టుకుపోయాడు.

ఈ సందర్భంగా అక్కడికి కొంతదూరంలో ఉన్నవారు రాజు కొట్టుకుపోతుండగా వీడియో తీశారు. శాయంపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి కావడంతో గాలించలేదు. బుధవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు మొదలుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం భారీ వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. పరకాల ఏసీపీ శివరామయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులైనా రాజు ఆచూకీ దొరక్కపోవడంతో అతడి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.