ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ హవాలా డబ్బు?

ఇంట్లో అగ్నిప్రమాదం.. బయటపడ్డ హవాలా డబ్బు?

హైదరాబాద్ : సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎక్కువగా వుడ్ ఫర్నిచర్ ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో కోటి రూపాయల నగదును గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ నగదు హవాలా మనీగా అనుమానిస్తున్నారు.

పోలీసులు ఆరా తీయగా ఇంటి యజమాని శ్రీనివాస్ ఓ వ్యాపారవేత్తగా గుర్తించారు. ప్రముఖ కంపెనీలో అతడు డీజీఎంగా పని చేస్తున్నాడు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నాడు శ్రీనివాస్. అయితే అగ్నిప్రమాద సమయంలో హైదరాబాద్ లో శ్రీనివాస్  లేడని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత.. ఇంటి సభ్యులు బెడ్ రూమ్ లో క్యాష్ సేఫ్ గా ఉందా..? లేదా అని చూస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా ఇంట్లో రూ.కోటి 64 లక్షల 45 వేల డబ్బు, బంగారం, వెండి లభ్యమైంది. నగదును సీజ్ చేసి, స్టేషన్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.