సిటీ శివార్లలో గుర్తుతెలియని డెడ్​బాడీలు

సిటీ శివార్లలో గుర్తుతెలియని డెడ్​బాడీలు
  • శేరిగూడలో దొరికిన డెడ్ బాడీ కేసును హత్యగా తేల్చిన పోలీసులు
  • అనుమానాస్పదంగానే  అబ్దుల్లాపూర్ మెట్​లో మహిళ, ఎల్ బీనగర్ లో వ్యక్తి మృతి ఘటనలు
  • దర్యాప్తులో కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టులు

ఎల్ బీ నగర్,వెలుగు: సిటీ శివార్లలో వరుసగా గుర్తు తెలియని డెడ్ బాడీలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ నెల 12న  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తి పక్కనే ఉన్న కాల్వలో ఓ మహిళ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళకు 30 నుంచి 35 ఏండ్లు ఉండొచ్చని భావించారు. అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేసిన పోలీసులు  డాగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌తో పాటు క్లూస్‌‌‌‌ టీంలను తీసుకువచ్చి ఆధారాలు సేకరించారు. చనిపోయిన మహిళ ఇతర రాష్ట్రానికి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పీఎస్ లతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా లుక్ ఔట్ నోటీసులు పంపించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా..  మహిళ కడుపులో నీరు ఉన్నట్లు ప్రైమరీ రిపోర్టులో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్  పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప హత్య లేక ఆత్మహత్య అనేది తెలియదంటున్నారు. 

బైరామాల్ గూడలో..

ఈ నెల 12నే ఎల్ బీనగర్ పరిధి  బైరామల్‌‌‌‌ గూడ వద్ద డ్రైనేజీ నాలాలో ఓ వ్యక్తి  డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. అతడికి 35 ఏండ్లు  ఉంచొచ్చని భావించారు. బల్దియా డీఆర్ఎఫ్ టీమ్ తో డెడ్ బాడీని బయటికి తీయించి అదే రోజు ఉస్మానియాకు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు ఫైల్ చేశారు.  పోస్టు పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రాలేదని పోలీసులు చెప్తున్నారు. 

శేరిగూడలో..

ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధి శేరిగూడలోని ఓ వెంచర్ లో ఈ నెల 16న ఓ డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించి హత్యగా తేల్చారు. మర్డర్ కేసు ఫైల్ చేసి స్పెషల్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు.ఈ  కేసులోనూ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.  మృతుడు ఓల్డ్ సిటీకి చెందిన వాడిగా గుర్తించిన పోలీసులు అతడిని ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజులుగా వెంచర్‌‌‌‌కు ఎవరెవరు వచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ ,బైరామల్ గూడ కేసుల్లో పోస్టుమార్టం రిపోర్టులు కీలకంగా మారనున్నాయి. మరోవైపు సిటీ శివార్లలో వారం రోజుల వ్యవధిలోనే ఇలా గుర్తుతెలియని డెడ్ బాడీలు దొరకడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వేరే ప్రాంతాల్లో హత్య చేసి డెడ్ బాడీలను ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.