కొండగట్టు చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

కొండగట్టు చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జగిత్యాల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి అంజన్న వెండి విగ్రహం సహా మొత్తం 5 కిలోల వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల ఎస్పీ భాస్కర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా కొండగట్టు ఆలయంలో చోరీకి పాల్పడిందని వెల్లడించారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా..చోరీకి ప్లాన్ చేసిందని..ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. 

కొండగట్టు ఆలయంలో చోరీ చేసేందుకు దొంగలు ఫిబ్రవరి 22న బీదర్ జిల్లా నుంచి కొండగట్టుకు వచ్చారని ఎస్పీ భాస్కర్ తెలిపారు. భక్తుల రూపంలో ఆలయానికి వచ్చిన నిందితులు..22న సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. ఈ సమయంలోనే ఆలయంలోని ఆభరణాలు, ఇతర వస్తువులను గమనించారన్నారు. ఆ రోజు రాత్రి కొండగట్టుమీదనే ఉండి..మరుసటి రోజు 23వ తేదీ మరోసారి అంజన్నను దర్శించుకున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి రెక్కీ నిర్వహించారని వెల్లడించారు.  24వ తేదీ అర్థరాత్రి 1 గంటలకు ఆలయంలో చోరీకి పాల్పడ్డారని ఎస్పీ భాస్కర్ తెలిపారు.