అల్లర్ల సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు

అల్లర్ల సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు

హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన రాకేశ్ అనే యువకుడు మృతి చెందాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను స్టేషన్ నుంచి ఖాళీ చేయించారు. అల్లర్లకు కారణమైనవారిని పట్టుకునే పనిలో పడ్డ పోలీసులు... దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మొత్తం 40కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ నుంచి అభ్యర్థులు వచ్చినట్టు  దర్యాప్తు అధికారులు తేల్చారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుల  అత్యుత్సాహం కారణంగా అల్లర్లు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ క్రమంలో ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు రైల్వే  స్టేషన్ టార్గెట్ గా 10కి పైగా వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్ చాట్, వీడియోస్, సోషల్ మీడియా పోస్ట్ , మీడియా లోని వీడియో బైట్స్ ఆధారంగా అసలైన ఆందోళన కారులను గుర్తించే పనిలో అధికారులు మునిగిపోయారు. ఇప్పటి వరకు 200 మందిని గుర్తించిన పోలీసులు... టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.