మేడారంలో 49 చోట్ల పార్కింగ్..1,050 ఎకరాల స్థలాన్ని కేటాయించిన పోలీసులు

మేడారంలో 49 చోట్ల పార్కింగ్..1,050 ఎకరాల స్థలాన్ని కేటాయించిన పోలీసులు
  • రూ.150 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు
  • సివిల్​ వర్కులకు రూ.90 కోట్లు కేటాయింపు
  • నాన్​ సివిల్​ వర్కులకు రూ.60 కోట్ల నిధులు విడుదల
  • మహా జాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష

హైదరాబాద్, వెలుగు:  వచ్చే ఏడాది జనవరి 28  నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క సారక్క మహా జాతర కోసం పోలీసులు 49 చోట్ల పార్కింగ్​ ప్లేస్​లను గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేట్, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్ పార్కింగ్  చేయడానికి 1,050 ఎకరాలను కేటాయించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం మహా జాతర నిర్వహణ కోసం కోర్​ ఏరియాను 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించారు.

 జంపన్న వాగు ప్రాంతాన్ని జోన్–3 కింద నిర్ణయించారు. మహా జాతర సమయంలో 10 నుంచి 12 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి జోన్‌‌కు ఒక జోనల్ ఆఫీసర్ ను నియమించనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సివిల్ వర్క్స్ స్టేటస్, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్ మీద సమీక్ష జరగగా అన్నీ ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ కోసం తీసుకున్న నిర్ణయాలను ములుగు కలెక్టర్​ టీఎస్​ దివాకరతో కలిసి సభ్యసాచి ఘోష్​ ప్రకటించారు. 

నవంబర్​ నెలాఖరు నాటికి పనులు కంప్లీట్

మేడారంలో గుర్తించి పార్కింగ్ ప్లేస్​లలో 4.5 లక్షల నుంచి 6 లక్షల వరకు వెహికల్స్​ ఒకే రోజు పార్కింగ్​ చేయవచ్చు. పోలీసులు గుర్తించిన 49 పార్కింగ్​ స్థలాల దగ్గర నవంబర్​ నెలాఖరు లోపు పనులు కంప్లీట్​ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. అలాగే, జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా అక్కడ మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. 

517 బోరు పాయింట్లు రిపేర్​ చేస్తున్నారు. వీటితో పాటు 250 కి.మీ. దూరం రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు చేస్తున్నట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. 9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులను విద్యుత్ శాఖ చేపట్టింది. 

జాతర ప్రాంతమంతా ఎండోమెంట్​ శాఖ ఆధ్వర్యంలో రంగు రంగుల బల్బులతో తీర్చిదిద్దే ఇల్యూమినేషన్ వర్క్స్​ చేస్తున్నారు. జాతర  ముందు, జాతర జరుగుతున్న సమయం, జాతర తరువాత చేపట్టే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆఫీసర్లు పలుమార్లు మేడారం వెళ్లి తనిఖీలు చేస్తారని సభ్యసాచి ఘోష్​ ప్రకటించారు.

 అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో  లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, టీఎస్​ ఎన్​పీడీసీఎల్​ సీఎండీ వరుణ్ రెడ్డి, ములుగు ఎస్పీ శబరీష్​, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు

మేడారం జాతర కోసం ప్రభుత్వం రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేయగా.. వాటిలో రూ.90 కోట్లు సివిల్​ వర్కులకు, రూ.60 కోట్లు నాన్​ సివిల్​ వర్కుల కోసం ఖర్చు చేస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే మహా జాతరలో కోటి 20 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఆ టైమ్​లో సెల్​ ఫోన్​ సిగ్నల్స్​ సరిగ్గా ఉండక భక్తులు ఇబ్బందులు పడేవారు. 

ఈసారి భక్తుల సౌకర్యార్థం 24 శాశ్వత టవర్స్, 20 సెల్ -ఆన్-వీల్స్, 350 వై-ఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆఫీసర్లు వివరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 33 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుంచి డబుల్ లేన్) అభివృద్ధి చేస్తున్నారు. వైల్డ్‌‌ లైఫ్ ఏరియాలో ఉన్న రోడ్లను కూడా ఇందులో చేర్చారు. ఆర్​ అండ్​ బీ శాఖ ద్వారా రూ.42 కోట్లతో ఆలయం చుట్టూ రోడ్లను అభివృద్ధి చేస్తుండగా.. రూ.92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మిస్తున్నట్టుగా సభ్యసాచి ఘోష్​ ప్రకటించారు.