ఉత్తరప్రదేశ్ లో మహిళలపై పోలీసుల లాఠీచార్జ్

ఉత్తరప్రదేశ్ లో మహిళలపై పోలీసుల లాఠీచార్జ్

లక్నో : అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై ఉత్తరప్రదేశ్ లో పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు. పైపులు, లాఠీలు, కట్టెలతో విరుచుకుపడ్డారు. అంబేద్కర్‌నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లోని ఓ ప్రాంతంలో ఈ మధ్య  బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంపై వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. నిరసనకు దిగారు.

విషయం తెలియగానే ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులు, కట్టెలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కొందరు మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్లు రువ్వడంతోనే వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు తెలియజేశారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.