పోలీసుల ఓవర్ యాక్షన్.. ఎమర్జెన్సీ స్టాఫ్​పై పోలీసుల లాఠీ

V6 Velugu Posted on May 23, 2021

  • కఠినంగా లాక్​డౌన్​ అమలు చేస్తున్నామంటూ పోలీసుల ఓవర్​ యాక్షన్​
  • నల్గొండలో కరెంట్​, మెడికల్​, మీడియా సిబ్బందిపై దాడి
  • పోలీసుల తీరుకు నిరసనగా కరెంట్​ కట్​ చేసిన విద్యుత్​ ఉద్యోగులు
  • హైదరాబాద్​లో ఫుడ్​ డెలివరీ బాయ్స్​పై ప్రతాపం

హైదరాబాద్‌‌/ నల్గొండ/ కూకట్​పల్లి, వెలుగు:రాష్ట్రంలో పదిరోజుల నుంచి లాక్​డౌన్​ అమలవుతున్నా ఎన్నడూ లేనంతగా శనివారం పోలీసులు ఓవర్​ యాక్షన్​ చూపించారు. రూల్స్​ కఠినంగా అమలు చేస్తున్నామని చెప్తూ... అత్యవసర సేవల సిబ్బందిని కూడా రోడ్ల మీద ఆపేశారు. బోర్డర్స్‌‌ ఎంట్రీస్‌‌, ఎగ్జిట్స్‌‌ క్లోజ్ చేశారు. గూడ్స్‌‌ వెహికల్స్‌‌పై ఆంక్షలు విధించారు. నల్గొండ జిల్లాలో కరెంట్, మెడికల్, మీడియా సిబ్బందిని పట్టుకొని కొట్టడం, హైదరాబాద్​లో పలు చోట్ల ఫుడ్​ డెలివరీ బాయ్స్​ను కొట్టడం వివాదాస్పదమైంది. పాసులు ఉన్నాయని చూపించే లోపే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వెహికల్స్​ను గుంజుకొని సతాయించారు. కొన్ని చోట్ల గంటల కొద్దీ తనిఖీల వల్ల రోడ్ల మీద  ట్రాఫిక్​ జామ్​లవడంతో  అంబులెన్స్​లు, ఆక్సిజన్​ సిలిండర్​ వెహికల్స్​ రవాణాకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలన్న సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాలతో డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి జిల్లాల యూనిట్స్‌‌, సీపీలు, ఎస్పీలను అలర్ట్‌‌ చేశారు. శనివారం ఉదయం నుంచే డీజీపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీపీలు, ఎస్పీలు అంతా రోడ్లపైకి వచ్చారు. చెక్‌‌పోస్ట్‌‌లో వెహికిల్‌‌ చెకింగ్స్‌‌ మానిటరింగ్‌‌ చేశారు. ఉదయం 10 గంటలకు లాక్​డౌన్​ సడలింపులు పూర్తికాగానే కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అనవసరంగా రోడ్లమీద తిరిగేవారితోపాటు ఎసెన్షియల్‌‌ సర్వీసుల  సిబ్బందినీ అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. గ్రేటర్ హైదరాబాద్‌‌లోని మూడు కమిషనరేట్ల లిమిట్స్‌‌లో డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ లిమిట్స్‌‌లోని కూకట్‌‌పల్లి వై జంక్షన్‌‌, జేఎన్‌‌టీయూ, రాచకొండ కమిషనరేట్‌‌ లిమిట్స్‌‌లోని కుషాయిగూడ, ఉప్పల్‌‌ చెక్‌‌పోస్ట్‌‌ల వద్ద బందోబస్తును పరిశీలించారు.  

గ్రేటర్​లో 10,139 వెహికల్స్​ సీజ్​

ప్రతి చెక్‌‌పోస్ట్‌‌ వద్ద పోలీసులు వెహికల్‌‌ చెకింగ్‌‌ స్ట్రిక్ట్‌‌  చేశారు. మెయిన్ రోడ్లను కలిపే ఇంటర్నల్‌‌ రోడ్స్‌‌ను బారికేడ్లతో క్లోజ్‌‌ చేశారు. చెక్‌‌పోస్ట్‌‌ మీదుగా ట్రావెల్‌‌ చేసే ప్రతి వెహికల్‌‌ను చెక్‌‌ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. పర్మిషన్స్‌‌ లేకుండా రోడ్డెక్కిన వాహనదారులపై డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌, సెక్షన్ 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు.  శనివారం ఒక్కరోజే గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో 10, 139 వెహికల్స్​ను సీజ్​ చేశారు. ఇందులో  ఎక్కువగా బైక్​లు ఉన్నాయి. లాక్‌‌డౌన్‌‌ తర్వాత కోర్టులో చార్జ్‌‌షీట్‌‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టులో విచారణకు హాజరైన తర్వాతే  వెహికల్స్​ రిలీజ్‌‌ చేయనున్నారు.

బోర్డర్స్‌‌ క్లోజ్‌‌, గూడ్స్‌‌ వెహికల్స్‌‌పై ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, సిటీల్లోని రోడ్లను క్లోజ్‌‌ చేశారు. హైదరాబాద్‌‌ ఎంట్రీ, ఎగ్జిట్స్‌‌ను సీజ్‌‌ చేశారు. సీజ్‌‌ చేసిన రూట్స్‌‌ను లాక్‌‌డౌన్‌‌ ముగిసిన తర్వాత ఓపెన్‌‌ చేయనున్నారు. గూడ్స్‌‌ వెహికల్స్‌‌పై ఆంక్షలు విధించారు. రోజూ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే వీటిని సిటీలోకి అనుమతిస్తామని చెప్పారు. గూడ్స్‌‌ వెహికల్స్‌‌ మూవ్‌‌మెంట్‌‌పై హైదరాబాద్‌‌, రాచకొండ, సైబరాబాద్ సీపీలు శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి గూడ్స్‌‌ వెహికల్స్‌‌కి పర్మిషన్ లేదన్నారు.  లాక్‌‌డౌన్ టైమ్‌‌లో రోడ్లపైకి వస్తే వెహికల్స్​ సీజ్ చేస్తామని హెచ్చరించారు.

పోలీసుల తీరుపై ఒవైసీ ఆగ్రహం

ఫుడ్ డెలివరీ బాయ్స్​పై శనివారం పోలీసులు చేసిన దాడులపై ఎంఐఎం చీఫ్​, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్​డౌన్​ జీవోలో ఈ కామర్స్, ఫుడ్ డెలివరీకి అనుమతులు ఉన్నాయని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వెంటనే ఫుడ్ డెలివరీ బాయ్స్ పై కేసులు ఎత్తివేసి వెహికల్స్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త జీవో రిలీజ్ చేసేంత వరకు ఫుడ్ డెలివరీ బాయ్స్ ను 
అనుమతించాలన్నారు. 

ఫుడ్​ డెలివరీకి లోకల్ పోలీసుల నుంచి పర్మిషన్​ తీసుకోవాలి

లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. పర్మిటెడ్‌ కేటగిరి తప్ప ఇతరులు రోడ్డపైకి వస్తే కేసులు రిజిస్టర్ చేస్తాం. వెహికిల్‌ సీజ్ చేస్తాం. అన్ని సిటీస్‌లోకి ఎంట్రీ, ఎగ్జిట్‌ క్లోజ్ చేశాం. ఈ-– కామర్స్‌, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ లోకల్​ పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కొందరు ఫుడ్​ డెలివరీ టీ షర్ట్స్‌ వేసుకుని ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు సహకరించాలి.
– డీజీపీ ఎం.మహేందర్‌‌ రెడ్డి

పోలీసుల తీరుకు నిరసనగా కరెంట్​ కట్​

రూల్స్ ​ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాళ్లతోపాటు అత్యవసర సర్వీసులకు సంబంధించిన వారిపై నల్గొండ పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. శనివారం పట్టణంలో పోలీసులు పలుచోట్ల పికెట్లు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో లాక్​డౌన్​ను పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిని ఆయా పాయింట్లలో ఆపి ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పాసులు ఉన్నవాళ్లను కూడా వదల్లేదు. వాళ్లు పాసులను బ్యాగుల నుంచి తీసేలోపే పోలీసులు కొట్టడం మొదలు పెట్టారు. ఇలా విద్యుత్‌‌,  మెడికల్, మీడియా సిబ్బందిపై కూడా దాడి చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా విద్యుత్‌‌ శాఖ ఉద్యోగులు పట్టణంలో కరెంటు సరఫరా నిలిపివేశారు. అత్యుత్సాహం చూపిన వాళ్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని  ఎస్పీ చెప్పారు.  అనంతరం విద్యుత్‌‌ శాఖ ఉద్యోగులు పట్టణంలో విద్యుత్​ సరఫరాను తిరిగి స్టార్​ చేశారు. 

ఫుడ్​ డెలివరీకి పర్మిషన్​ ఉన్నా అడ్డుకున్నరు

హైదరాబాద్​లోని  కూకట్​పల్లి వై జంక్షన్​, సౌత్​ ఇండియా షాపింగ్​మాల్, జేఎన్​టీయూ చెక్​పోస్టుల వద్ద వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. ముఖ్యంగా ఫుడ్​ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోతో పాటు ఇతర ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ  బాయ్స్​ను కొట్టడం వివాదాస్పదమైంది. తమకు ఫుడ్​ డెలివరీ చెయ్యడానికి అనుమతులు ఉన్నాయని, లాక్​డౌన్​ మినహాయింపుల జీవోలోనే ఈ వివరాలు ఉన్నాయని చెబుతున్నా పోలీసులు వినిపించుకోకుండా లాఠీలకు పని చెప్పారు. సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ కూకట్​పల్లి ప్రాంతంలోని చెక్​పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్​లపై వెళ్తున్న ఫుడ్​ డెలివరీ బాయ్స్​ను పోలీసులు పక్కకు పిలిచి లాఠీలతో కొట్టారు. అయితే.. ఫుడ్​ డెలివరీ ముసుగులో కొందరు అనవసరంగా బయట తిరుగుతున్నారని పోలీసులు చెప్తున్నారు. 
 

Tagged NALGONDA, lockdown, Kukatpally, hydrabad, Police laticharge, emergency staff

Latest Videos

Subscribe Now

More News