పోలీసుల నిఘాలో.. ఉప్పల్ స్టేడియం

పోలీసుల నిఘాలో.. ఉప్పల్ స్టేడియం
  •      ఇయ్యాల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్​ 
  •      నేపథ్యంలో భారీ బందోబస్తు

హైదరాబాద్, వెలుగు : ఐసీసీ వన్డే వరల్డ్ కప్–2023 మ్యాచ్​ల్లో మూడింటికి ఉప్పల్‌‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌ స్టేడియం వేదిక కానుండగా.. శుక్రవారం నెదర్లాండ్స్– పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో సెక్యూరిటీ పెట్టారు. 360 సీసీటీవీ కెమెరాలు, షీటీమ్స్‌‌, మఫ్టీ పోలీసులు, టీఎస్‌‌ఎస్‌‌పీ, ఎస్‌‌ఓటీ, సీసీఎస్‌‌, ట్రాఫిక్ పోలీసులతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. బైక్స్,కార్ల పార్కింగ్​కు 18 ఏరియాలను కేటాయించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్‌‌ గురువారం మీడియాకు  వివరాలు వెల్లడించారు.

ప్లేయర్స్‌‌కు, క్రికెట్‌‌ ఫ్యాన్స్​కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. స్టేడియంలో సుమారు 39 వేల మందికి సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. చాలా కాలం తర్వాత వరల్డ్‌‌ కప్ మ్యాచ్​ హైదరాబాద్​లో జరుగుతుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేశామన్నారు. స్టేడియంను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, బాంబ్‌‌ , డాగ్‌‌స్క్వాడ్‌‌లతో తనిఖీలు చేపట్టామన్నారురు. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుండగా.. 11 గంటలకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు.

గేట్‌‌ నం.6 వద్ద కమాండ్ అండ్ కంట్రోల్‌‌ రూమ్‌‌ను ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలోకి ప్రవేశించే వారిని చెక్ చేసేందుకు ప్రత్యేక స్కానర్లు, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ఎంట్రీ గేట్స్ వద్ద అధునాత స్కానర్లను, డాగ్ స్క్వాడ్​ను వాడుతున్నట్లు సీపీ చౌహాన్ తెలిపారు. క్రికెటర్లు, వీఐపీలు, వీవీఐపీలు స్టేడియంలోకి వచ్చే ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ వద్ద సిటీ సెక్యూరిటీ వింగ్, ఎస్కార్ట్ వెహికల్​తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో రోడ్ క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.