గణేష్ ఉత్సవాలు..సిటీలో ఈ రూల్స్ పాటించాల్సిందే..

గణేష్ ఉత్సవాలు..సిటీలో ఈ రూల్స్ పాటించాల్సిందే..

వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా సిటీలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. వినాయక మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని పోలీస్  సిబ్బందితో పాటు జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు గైడ్ లైన్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు . 

వినాయక చవితికి హైదరాబాద్ లో జరిగే వేడుకల్ని చూసేందుకు భారీ ఎత్తున జనం నగరానికి చేరుకుంటారు. నిమజ్జనానికి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొంటారు. దాంతో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులు. ఎలాంటి మత ఘర్షణలు జరక్కుండా, ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

మండపాల దగ్గర సీసీ కెమెరాలు 

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు గణేష్ మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో దాదాపు 16 వేల పోలీసు సిబ్బంది ఉంటారు. సైబరాబాద్ లో 5 వేలు, రాచకొండ పరిధిలో 6 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది ఉంటారు. వీళ్ళే కాకుండా కేంద్ర బలగాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే పోలీస్ ఉన్నతాధికారులు జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి... హైదరాబాద్ లో గణేష్ మండపాల దగ్గర భద్రతలో ఉపయోగిస్తున్నారు . మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఖైరతాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను దింపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వెళ్లే వాహనాలను నిరాంకారి భవన్ వైపు మళ్ళిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు లైబ్రరీ వెనుక ఉండే MCH శానిటరీ వార్డు ఆఫీస్ వైపు వెళ్లాలి. మింట్ కాంపౌండ్ లైను నుంచి నెక్లేస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలను ప్రింటింగ్ ప్రెస్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉత్సవాలు ముగిసే దాకా ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయనీ... వాహనాదారులు ఆల్టర్నేట్ రూట్స్ లో వెళ్లాలని పోలీసులు సూచించారు. రాత్రి పదింటి నుంచి ఉదయం ఆరు వరకు ఎట్టి పరిస్థితుల్లో లౌడ్ స్పీకర్లను వాడొద్దని పోలీసులు హెచ్చరించారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహం నిమజ్జనానికి వాడే వాహనం వివరాలను ముందుగా పోలీసులకు తెలపాలి. మండపాల్లో దీపారాధనలతో అగ్నిప్రమాదాలు జరక్కుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు.