నిందితుడిని జైలులో పెట్టుకుని..20 ఏండ్లు ఊరంతా వెతికిన పోలీసులు

నిందితుడిని జైలులో పెట్టుకుని..20 ఏండ్లు ఊరంతా వెతికిన పోలీసులు
  • అధికారుల నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టిన కోర్టు

ముంబై: చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికిన చందంగా ఓ హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు తెగ వెతికారు.. సదరు నిందితుడేమో మరో కేసులో అరెస్టయి అండర్​ ట్రయల్​ ఖైదీగా జైలులో కూచున్నాడు. 1999లో హత్య జరగగా.. దాదాపు 20 ఏళ్ల పాటు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఛోటా షకీల్ గ్యాంగ్ కు చెందిన కిరాయి హంతకుడు మహిర్  సిద్దికి 1999లో ముంబైలో వాహిద్  అలీ ఖాన్ (బాంబే అమన్  కమిటీ ప్రెసిడెంట్) ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ సంవత్సరం జులైలో ఎల్టీ మార్గ్ లో వాహిద్ ను ఆయన నివాసం వద్ద మహిర్  తన అనుచరుడితో కలిసి కాల్చి చంపాడు. తర్వాత ఆ ఇద్దరూ బైక్ పై పారిపోయారు. 2019 మేలో పోలీసులు సిద్దికీని ట్రేస్  చేసి అరెస్టు చేశారు. వాహిద్ ను సిద్దికీ హత్య చేశాడని చార్జిషీట్  ఫైల్  చేశారు.

ఛోటా షకీల్  సహా మొత్తం ఆరుగురికి ఆ హత్యతో సంబంధం ఉందని, ఛోటా షకీల్ ఆధ్వర్యంలోనే మర్డర్  జరిగిందని చార్జిషీటులో పేర్కొన్నారు. హత్య జరిగినప్పటి నుంచి సిద్దికీని అరెస్టు చేసే వరకూ అతడు పరారీలో ఉన్నాడని దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే మరో కేసులో 2014 నుంచి 2019 మధ్య సిద్దికీ జైల్లో అండర్  ట్రయల్ గా ఉన్నాడు. అతడు జైల్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేదు. తర్వాత సీఐడీ అధికారులు సిద్దికీని అరెస్టు చేశారు. దీనిపై కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ‘‘వాహిద్  హత్య కేసులో నిందితుడు సిద్దికీ పరారీలో ఉన్నట్లు పోలీసులు రికార్డుల్లో పేర్కొన్నా అతడిని ట్రేస్  చేయడంలో వారు విఫలమయ్యారు. అలాగే అతడు అండర్  ట్రయల్​గా ఉన్న విషయాన్నీ పోలీసులు గుర్తించలేదు. అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో తేడాలు ఉన్నాయి’ అని కోర్టు పేర్కొంది.