కొత్త ప్యాకెట్లో పాత విత్తనాలు.. సీజ్ చేసిన పోలీసులు

V6 Velugu Posted on Jun 12, 2021

  • రాచకొండ పరిధిలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
  • గడువు ముగిసిన విత్తనాలను కొత్త ప్యాకెట్లో వేసి అమ్ముతున్న ముఠా
  • కోటి 16 లక్షల విలువ గల నకిలీ విత్తనాలు సీజ్
  • నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
  • రాచకొండ సీపీ మహేష్ భగవత్

రాచకొండ పరిధిలో భారీగా నకిలీ విత్తనాల పట్టుబడ్డాయి. కోటి 16 లక్షల విలువ గల నకిలీ పత్తి, మిర్చి విత్తనాలను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం హయత్ నగర్, వనస్థలిపురంలో ఉన్న విత్తనాల గోడౌన్లపై దాడులు చేసి నకిలీ పత్తి, మిర్చి, వరి, పల్లి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో పోలీసులు మూడు ప్రాంతాలలో దాడులు చేశారు. 

నకిలీ విత్తనాల పట్టివేతపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్పందించారు. నకిలీ విత్తనాలతో మోసపోయి గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. ఒకే రోజు మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గోదాములను సీజ్ చేసిన సందర్భరంగా సీపీ మహేష్ భగవత్.. ఎల్బీ నగర్ సీపీ క్యాంపు ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులు, గోదాములపై సోదాలు చేశాం. హయత్ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాపులపై దాడులు చేశాం. 

మొదటి కేసులో హయత్ నగర్‌లోని పసుమాముల గ్రామంలో రూ. 60 లక్షల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ చేశాం. డేట్ దాటిన పత్తి, మిర్చి, వేరుశనగ విత్తనాలు విక్రయిస్తున్నారు. ఆ గోదాం యజమాని గారినేని ఫణి గోపాల్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం. గోపాల్‌కి మునుగునూర్‌లో సీడ్స్ బిజినెస్ ఉంది. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గత నాలుగు సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న 10 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం. ఎస్వోటి టీమ్‌తో పాటు అగ్రీకల్చరల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాం. గడువు ముగిసిన ప్యాకేట్స్‌లో ఉన్న విత్తనాలను మళ్ళీ కొత్త ప్యాకేట్స్‌లో వేసి అమ్ముతున్నారు. 

రెండవ కేసులో రూ. 50 లక్షల విలువ గల నకిలీ విత్తనాలు పట్టుకున్నాం. గోపాల్ కమల్ కిషోర్ అలియాస్ గోపాల్ అగర్వాల్ అనే యజమానిని అరెస్ట్ చేశాం. గోపాల్ అగర్వాల్‌పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఈయన ఎలాంటి లైసెన్స్ లేకుండా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నాడు. 

మూడవ కేసులో రూ. 6 లక్షల విలువ గల నకిలీ విత్తనాలను సీజ్ చేశాం. BT-3 విత్తనాలకు భారత దేశంలో బ్యాన్ ఉంది. ఇలాంటి విత్తనాలను ఇక్కడికి తీసుకువచ్చి రైతులను మోసం చేస్తున్నారు. వనస్థలిపురంలో ఎస్వోటి టీమ్ నేతృత్వంలో దాడులు చేసి.. యశోద అపార్ట్‌మెంట్‌లో కాకాని వెంకటరమణని అరెస్ట్ చేశాం. సురేఖ, శ్రీ సాయి అనే పేరుతో ఉన్న పత్తి విత్తనాలను సీజ్ చేశాం. కర్నూలు నుండి డీలర్ షిప్ తీసుకుని..  ఎలాంటి లైసెన్సు లేకుండా విత్తనాలను విక్రయిస్తున్నారు. విత్తనాలను విక్రయిస్తున్న వారికి కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. కాకాని వెంకటరమణ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. కాకాని వెంకటరమణతో పాటు వీరంజానేయులు అనే వ్యక్తి కూడా ఈ కేసులో ఉన్నాడు. ప్రస్తుతం వీరంజనేయులు పరారీలో ఉన్నాడు. కాకాని వెంకటరమణపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం’ అని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Tagged Hyderabad, Telangana, agriculture, vanasthalipuram, CP Mahesh Bhagavath, fake seeds, Farmer\\\\\\\'s, hayatnagar

Latest Videos

Subscribe Now

More News