పుణె, ఢిల్లీలో..రూ.3,500 కోట్ల డ్రగ్స్ సీజ్​

పుణె, ఢిల్లీలో..రూ.3,500 కోట్ల డ్రగ్స్ సీజ్​
  •     1,700 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం  
  •     ఫుడ్ ప్యాకెట్లలో డ్రగ్స్ దాచి లండన్​కు సరఫరా
  •     8 మందిని అరెస్టు చేసిన పోలీసులు 

పుణె:  మహారాష్ట్రలోని పుణె, ఢిల్లీలో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ‘మ్యావ్.. మ్యావ్’గా పిలిచే మెఫెడ్రోన్ డ్రగ్ ఏకంగా 1,700 కిలోలు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 వేల కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్​ను పుణె నుంచి ఢిల్లీకి తరలించి, అక్కడి నుంచి లండన్​కు పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ కొరియర్ కంపెనీ ద్వారా ఫుడ్ ప్యాకెట్లలో డ్రగ్స్​ను దాచి, లండన్​కు చేరవేస్తున్నట్టు ఆధారాలు సేకరించారు.

పెద్ద డ్రగ్ రాకెట్... 

ఇటీవల రూ.2 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ ను పుణె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. పెద్ద డ్రగ్ రాకెట్​ను గుర్తించారు. రెండ్రోజుల పాటు పుణె, ఢిల్లీలో దాడులు చేసి.. ఇప్పటి వరకు 1,700 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మహారాష్ట్రలోని కొన్నిచోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ‘‘పుణె శివారులోని కురుకుంభ్ ఎంఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారని సమాచారం అందింది. ఆ ఫ్యాక్టరీపై మా టీమ్ దాడి చేసి, 600 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మరోచోట 120 కిలోలు పట్టుకుంది. ఇక్కడ దొరికిన సమాచారంతో ఢిల్లీలో దాడులు చేసింది. అక్కడ 970 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1,700 కిలోల డ్రగ్స్ పట్టుకున్నం. దీని విలువ రూ.3 వేల నుంచి రూ.3,500 కోట్లు ఉంటుంది” అని పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. ‘‘ఢిల్లీలోని ఓ కొరియర్ కంపెనీ ద్వారా డ్రగ్స్ ను లండన్ కు పంపిస్తున్నట్టు ఆధారాలు దొరికాయి. ఫుడ్ ప్యాకెట్లలో దాచి డ్రగ్స్ ను లండన్ కు చేరవేస్తున్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నది. అరెస్టు చేసిన 8 మందిని విచారిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయనే దానిపై ఫోకస్ పెట్టాం. త్వరలోనే సప్లై చెయిన్ మొత్తాన్ని పట్టుకుంటాం” అని చెప్పారు.