అమ్మలు జైలుకెళ్లారని కన్నీరుమున్నీరవుతున్న చిన్నారులు

అమ్మలు జైలుకెళ్లారని కన్నీరుమున్నీరవుతున్న చిన్నారులు

తల్లులు లేక ఆ పిల్లలు అల్లాడి పోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫారెస్ట్ ల్యాండ్ లో పోడు వ్యవసాయం చేశారని మంచిర్యాల జిల్లా కోయపోచగూడానికి చెందిన 12 మంది గిరిజన మహిళలను జైలుకు పంపారు పోలీసులు. 12మంది మహిళలకు లక్షెట్టిపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. అరెస్టైన మహిళల్లో చంటిబిడ్డల తల్లులు ఉన్నారు. పాలకోసం ఆ చిన్నారులు వెక్కివెక్కి ఏడుస్తుండటంతో ఆ గిరిజన గ్రామం కన్నీరు పెట్టుకుంటుంది. తాతల కాలం నుంచి సాగుచేస్తున్న భూమిలో వ్యవసాయం చేస్తే తప్పేంటని గిరిజన గ్రామం ప్రశ్నిస్తోంది. ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు తమ గ్రామ మహిళలను అరెస్ట్ చేశారని వాపోతున్నారు..


మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామపంచాయతీ పరిధి కోయపోచగూడెంలో 40 వరకు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు నివసిస్తున్న లింగపూర్ బీట్ ప్రాంతం మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. అటవీ భూముల్లోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు గిరిజనులు. లింగపూర్ బీట్ పరిధిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అటవీ భూముల్లోని తుప్పలు తొలగించి గిరిజనులు పంటలు వేసుకోవటం.. ఫారెస్ట్ సిబ్బంది ట్రాక్టర్లతో ధ్వంసం చేయటం కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇలా 20 ఏండ్లుగా పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు కోయపోచగూడెం గిరిజనులు. అయితే ఈ వానా కాలంలో సాగుచేసేందుకుసిద్ధమయ్యారు. ఎప్పటిలాగే ఫారెస్ట్ అధికారులు వాటిని ధ్వంసం చేశారు. దీంతో గిరిజనులకు పారెస్ట్, పోలీసు అధికారులకు మధ్య తీవ్రవాగ్వివాదం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించుకున్నారని.. పారెస్ట్ ప్లాంటేషన్ ను తొలగించారని.. 12మంది మహిళలతో సహా 19మందిపై కేసులు పెట్టారు. అదేరోజు అర్ధరాత్రి జైలుకు తరలించారు.